AP Politics : టీడీపీకి పీకే రాక వెనక ఏం జరిగింది..?

అనూహ్యంగా ఏపీ ఎన్నికలకు మూడు నెలలు ముందు చంద్రబాబు నాయుడిని కలిశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ కలయికతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చిన్న కుదుపే వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించడం ఖాయం అయిపోయింది. 2019 ఎన్నికల్లో వైసిపికి వ్యూహకర్త గా వ్యవహరించి.. ఆ పార్టీ విజయానికి దోహదపడ్డారు పీకే.

 

అనూహ్యంగా ఏపీ ఎన్నికలకు మూడు నెలలు ముందు చంద్రబాబు నాయుడిని కలిశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ కలయికతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చిన్న కుదుపే వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించడం ఖాయం అయిపోయింది. 2019 ఎన్నికల్లో వైసిపికి వ్యూహకర్త గా వ్యవహరించి.. ఆ పార్టీ విజయానికి దోహదపడ్డారు పీకే. ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలకు ముందు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అవడంపై అసలు తెర వెనక ఏం జరిగింది..? వైసీపీని వదిలి ప్రశాంత్ కిషోర్ టీడీపీ సైడ్ ఎందుకు వచ్చారు? వైసిపికి ఐప్యాక్ సంస్థ ఒక పక్క పని చేస్తూ ఉండగా ఆ సంస్థలో భాగమైన పీకే.. టిడిపికి ఎలా పని చేస్తారు ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయి.

2017 నుంచే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ సంస్థ ద్వారా వైసీపీకి స్ట్రాటజిస్ట్ గా పని చేశారు. అయితే ఐప్యాక్ సంస్థ ఒక్క ప్రశాంత్ కిషోర్ సొంతం కాదు. దీని వెనకున్న మరో ముఖ్యవ్యక్తి రిషి రాజ్ సింగ్. ఐ ప్యాక్ సంస్థ వ్యవస్థాపకుల్లో రిషి రాజ్ సింగ్ ఒకరు. అసలు ఐప్యాక్ వెనక మొత్తం పని చేసేది రిషినే. 2019 ఎన్నికల్లో వైసిపికి తెరవెనుక మొత్తం పని చేసింది రిషి.. ఆయన బృందమే. అయితే ఐ ప్యాక్ వ్యవస్థాపకులు ఒకరైన ప్రశాంత్ కిషోర్ తనకు తాను సూపర్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అంతా తానే అన్నట్లుగా మీడియాలో ప్రొజెక్షన్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసిపి గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ బాధ్యతలు నుంచి వైదొలగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.

రిషి మాత్రం ఎప్పటిలాగే లోప్రొఫైల్లో ఉంటూ.. ఐపాక్ ను నిర్వహిస్తున్నారు. రిషి.. వైసిపి అధినేత వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రిషి పెళ్లికి కూడా జగన్, భారతి అటెండ్ అయ్యారు. పీకే ఓ పక్క కాంగ్రెస్ తో బేరాలాడుతూ.. మరోవైపు నితీష్ తో కలిసి బిహార్ రాజకీయాలను నడిపించారు. ఏకంగా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పదవి కావాలనీ.. అక్కడున్న సీనియర్ నేతలకి ఎసరు పెట్టడానికి ప్రయత్నించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కూడా విభేదించి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర కూడా చేస్తున్నారు. పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఐ ప్యాక్ సంస్థ రిషి నాయకత్వంలోనే స్వతంత్రంగా వైసిపికి పనిచేస్తోంది. పీకేతోపాటు ఐ ప్యాక్ లో గతంలో సునీల్ కనుగోలు, రాబిన్ శర్మ కూడా పని చేశారు. వాళ్లు ఐ ప్యాక్ నుంచి విడిపోయి స్వతంత్రంగా సంస్థలు పెట్టుకొని వివిధ పార్టీలకు వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు. సునీల్ కనుగోలు కొన్నాళ్ల క్రితం టిడిపికి కూడా తెర వెనక సేవలు అందించారు. అయితే అతనికి ఇవ్వాల్సిన ఫీజు సొమ్మును టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎగ్గొట్టారు. దాంతో సునీల్ కు టీడీపీకి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత చంద్రబాబు కోరినా కూడా సునీల్.. టిడిపికి వ్యూహకర్తగా పనిచేయడానికి రాలేదు.

ఆ తర్వాత రాబిన్ శర్మ ను నియమించుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. రాబిన్ వ్యవహార శైలి, పనితీరు కూడా లోకేష్ కి, చంద్రబాబుకి నచ్చలేదు. చివరికి ఒకప్పుడు బిహారి డెకాయిట్ అని తిట్టిన ప్రశాంత్ కిషోర్ దగ్గరికి బాబు, లోకేష్ వెళ్లాల్సి వచ్చింది. టెక్నికల్ గా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీతో గానీ.. జగన్ తో గానీ లేరు. అతను ఒక పార్టీ నాయకుడు. అందువల్ల పీకేని ఒప్పించి టిడిపికి వ్యూహకర్తగా తీసుకొచ్చారు చంద్రబాబు. రాబిన్ కు, ప్రశాంత్ కిషోర్ కు మధ్య సయోధ్య కుదిర్చి.. వారిద్దరి సహకారంతో ఎన్నికలకు వెళ్లాలని బాబు ప్లాన్. అందుకు ప్రశాంత్ కిషోర్ పాక్షికంగా అంగీకరించినట్టు తెలిసింది. ఇక నుంచి పోల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా క్యాంపెయిన్ వీటికి సంబంధించిన ఐడియాలు ప్రశాంత్ కిషోర్ ఇస్తాడు. రాబిన్ శర్మ అమలు చేస్తాడు. ప్రతి ఎన్నికల్లో చేసినట్లే ప్రశాంత్ కిషోర్ ఈసారి కోడి కత్తో, నాటు బాంబునో ఎవరిపై ప్రయోగిస్తాడో.. అందుకు చంద్రబాబా.. లోకేషా.. ఎవర్ని తన నాటకానికి వాడతాడు అన్నది వేచి చూడాలి.