రోజుకో దుమారం.. పూటకో వివాదంలేనిదే.. ఏపీలోని విశాఖపట్నం ఎంపీకి రోజు గడువదు. ఎంవీవీ సూర్యనారాయణ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన సెంటిమెంట్స్ కోసం ఏకంగా జంక్షన్‌నే జామ్ చేసేసి జనాన్ని ఏడిపిస్తున్నారట. మేటర్ పొలిటికల్ కలర్ పులుముకుని ఎంపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కింది జనసేన. ఎంవీవీ సత్యనారాయణ.. విశాఖపట్నం ఎంపీ.. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ నుంచి ఢిల్లీ సభలో అడుగు పెట్టిన ఫక్తు బిజినెస్ మ్యాన్. నిర్మాణ రంగంలో 30 ఏళ్ళ అనుభవం ఉన్న ఎంవీవీ.. 2017లో అనూహ్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2019లో విశాఖ ఎంపీగా గెలిచారు. అటు వ్యాపారం, ఇటు రాజకీయంతో ఎంపీకి మొదటి మూడేళ్లు సజావుగానే సాగిపోయింది. అధినాయకత్వానికి అత్యంత విధేయుడుగా కలర్ రావడంతో వైసీపీ వర్గాల్లో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత లభించింది.
Alla Ramakrishna Reddy : జగన్ ద్రోహాన్ని ఆర్కే తట్టుకోలేకపోయాడా ?
ఈ క్రమంలో మధురవాడలో ఇంటెలిజెన్స్ ఎస్పీ భూ ఆక్రమణ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. గేటెడ్ కమ్యూనిటీ కోసం రహదారిని ఎస్పీ భూమిలో నుంచి వేసేందుకు సిద్ధం అయ్యారనేది వివాదాస్పదం అవగా.. దాన్ని సర్దుబాటు చేసుకునే క్రమంలో భవిష్యత్తులో విశాఖలో వ్యాపారాలు చేయనని ఎంపీ చేసిన ప్రకటన అప్పట్లో కలకలం రేపింది. ఆ స్టేట్‌మెంట్ మరో రూపంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. పెద్దల జోక్యంతో వివాదం ముగిసిన తర్వాత భారీ ప్రాజెక్టుల్లో ఎంవీవీ నిర్మాణ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తడం మొదలైంది. అప్పటి వరకు లోగుట్టుగా సాగిపోయిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా తెరపైకి రావడంతో ఎంపీ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఈ క్రమంలో పార్టీలో కీలక నేతతో ఎంవీవీ సున్నం పెట్టుకోవడం కొత్త చిక్కులకు కారణం అయ్యింది. కూర్మన్నపాలెంలో అత్యంత విలువైన స్థలాన్ని ఎంవీవీ.. వెంచర్ పేరుతో కొట్టేశారని ఆరోపణలు చెలరేగాయి. వీటిని ఖండించే క్రమంలో దసపల్లా భూముల వ్యవహారం బయట పెట్టి కీలక నేతను వేలెత్తి చూపించే ప్రయత్నం బూమ్ రాంగ్ అయ్యిందట.
ఆ తరువాత కాలంలో ఎంపీ చేసే ప్రాజెక్టులపై విపక్షాలు ఓ కన్నేసి ఉంచడం, లోపాలు దొరికితే ఉతికేయడం ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఆ దిశగా ఎంపీని ఎక్కువ టార్గెట్ చేసింది జనసేనే. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిపోవాలనే బలమైన కోరిక ఎంవీవీలో వుంది. హైకమాండ్ ను ఒప్పించి తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ పదవి తెచ్చుకున్నారు. అధినాయకత్వం నిర్ణయానికి ఎదురు చెప్పకపోయినా ఎంపీకి సహాయ నిరాకరణ చేస్తున్నాయి ఇక్కడ మిగిలిన గ్రూపులు. ఈ క్రమంలోనే.. సిటీ నడిబొడ్డున ఉన్న CBCNC భూముల్లో ఎంవీవీ నిర్మాణ కంపెనీ మొదలుపెట్టిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ “ది MVV పీక్” వివాదాల్లో చిక్కుకుంది. మిషనరీ భూములు అన్యా క్రాంతం అయ్యాయని టీడీపీ పోరాటం చేసింది. అప్పట్లో జనసేన వేరుగా కోర్ట్‌కు వెళ్ళింది. ఈ క్రమంలో కమర్షియల్ ప్రాజెక్ట్ కోసం GVMC TDRలు ఇవ్వడం ఒక ఎత్తైతే.. అత్యంత కీలకమైన టైకూన్ జంక్షన్ మూసేయడం రచ్చకు కారణం అయ్యింది.
వారాహియాత్రలో అందిన ఫిర్యాదులపై స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జంక్షన్‌ను తెరవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వ్యాపార అవసరాలు, వాస్తు సెంటిమెంట్ కోసం రోడ్డును మూసేశారనేది ఇక్కడ కీలకంగా మారింది. వాస్తు రీత్యా వీధిపోటు ఉండటం వల్లే GVMC అత్యుత్సాహం ప్రదర్శించి ఎంపీ వెంచర్ కోసం జంక్షన్ మూసేసిందని, దాంతో విశాఖ నగర జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గాజువాక బహిరంగ సభలో ప్రస్తావించిన పవన్ ఎంవీవీని ఏకిపడేశారు. ఈ క్రమంలోనే జంక్షన్‌ను తిరిగి తెరిపించాలంటూ జనసేన ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. దీంతో ఇది ఇప్పుడు పొలిటికల్ కలర్ పులుముకుంది. చివరికి జనసేన ఆందోళన ఫలిస్తుందా? లేక ఎంపీ వాస్తు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో చూడాలి.