ఇప్పటివరకు ఒక లెక్క… ఇకపై ఒక లెక్క.. ఏపీలో రీసౌండ్‌లో వినిపిస్తున్న డైలాగ్ ఇదే. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. అధికారం తమదే అని అటు వైసీపీ, ఇటు కూటమి ధీమాగా కనిపిస్తున్నాయ్. దీంతో కన్ఫ్యూజన్ మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది. ఫలితాలకు ఇంకొన్ని గంటలు బ్యాలెన్స్ ఉన్న వేళ.. పార్టీల బలాలేంటి.. బలహీనతలేంటి.. ఎవరికి ఏ అంశాలు కలిసిరాబోతున్నాయని.. డీకోడ్ చేసే పనిలో పడ్డారు జనాలంతా ! ఎగ్జిట్‌పోల్స్ నిజం అవుతాయా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. అటు వైసీపీ, ఇటు కూటమి.. బలాలు, బలహీనతల విషయంలో సమానంగా ఉన్నాయ్. అందుకే ఎవరిది విజయం అనే దాన్ని.. ఎవరూ సరిగా అంచనా వేయలేకపోతున్నారు. అంచనా వేసినా.. అది నిజమో కాదో అని అనుమాన పడుతున్నారు.
ఏపీలో భారీగా పోలింగ్ శాతం నమోదయింది. హైదరాబాద్ అంతా కదిలిపోయి మరీ.. ఏపీలో ఓటేసింది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేసిన వాళ్లు.. ఈ ఫలితాల్లో కీలకం కాబోతున్నారు. మహిళా ఓటర్లు, అదనంగా పోలయిన మహిళా ఓట్లు.. గ్రామీణ ఓటర్లు, రకరకాల సంక్షేమ పథకాల లబ్దిదారులు, వృద్ధులు, మైనార్టీ, ఎస్సీలు, ఎస్టీలు.. వైసీపీకి అనుకూలంగా ఉండే చాన్స్ ఉంది. ఇక పోల్ మేనేజ్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉండడం కూడా ఫ్యాన్ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేదనే భావన ఉన్నా.. దాదాపు ప్రతీ ఇంటికీ జగన్ సంక్షేమ పథకాలు వెళ్లాయి. ఆ పథకాలే ఇప్పుడు వైసీపీలో గెలుపు ఆశలకు ప్రాణంగా మారాయి. అందుకే ప్రతీ ప్రాంతంలో తాము చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నుంచి వైసీపీకి ఉన్న మద్దతు ఓట్‌బ్యాంక్‌గా మారితే ఈసారి కూడా జగనే గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా.
ఇక అటు కూటమి విషయానికి వస్తే.. ఉద్యోగులు, పట్టణ ప్రాంత ఓటర్లు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి.. హైదరాబాద్ నుంచి వచ్చినవారు, నిరుద్యోగులు, కాపు సామాజికవర్గ ఓటర్లు, హిందువులు కలిసి వచ్చే చాన్స్ ఉంది. పోల్ మేనేజ్‌మెంట్ ఎలా చేశారు అన్న దాని మీద వీళ్ల బలం ఆధారపడి ఉంటుంది. అర్బన్ ఏరియాల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత టీడీపీకి కలిసి వచ్చింది. ముఖ్యంగా అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం వైసీపీకి మైనస్‌గా మారింది. అదే సమయంలో కూటమి దాన్ని బలంగా మార్చుకుంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్‌బ్యాంక్ చీలకుండా మూడు పార్టీలు కూటమిగా చేరడంతో సీఎం పీఠంపై భారీ ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇక హైదరాబాద్ నుంచి దాదాపు 15లక్షల మంది ఓటర్లు ఓటేయడానికి ఏపీకి వెళ్లారు.. వీళ్లంతా ఎవరు మొగ్గు చూపారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 15లక్షల మందిలో.. అర్బన్, రూరల్ ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంతమంది కూటమి వైపు మొగ్గు చూపారు.. ఎందరు వైసీపీకి మద్దతుగా నిలిచారు అన్నది మరో పెద్ద టాస్క్. ఇక ఏపీలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 5 లక్షల 20 వేలు. ఇందులో అర్బన్, రూరల్ పోస్టల్ ఓటర్లు.. ఏ పార్టీకి ఓటేసి ఉంటారన్నది కీలకంగా మారబోతోంది.