కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈసారి లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ (Wayanad) నుంచి ఆయన లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది. కానీ కేరళలో పొత్తుల్లో భాగంగా వాయనాడ్ ను సీపీఐ (CPI) కి కేటాయించింది LDF కూటమి. దాంతో మరి రాహుల్ స్థానం ఏంటన్నది దానిపై చర్చ జరుగుతోంది.
2019లో రాహుల్ గాంధీ… ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అమేథీతో పాటు కేరళ (Kerala) లోని వాయనాడ్ లోక్ సభ స్థానంలో పోటీ చేశారు. అమేథీలో ఆయన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1967 నుంచి ఇద్దరు కాంగ్రేసేతర ఎంపీలు తప్ప… ఎప్పుడూ అక్కడ హస్తం పార్టీ హవానే నడుస్తోంది. కానీ బీజేపీ (BJP) గట్టి పోటీ ఇవ్వడంతో గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ కి ఓటమి తప్పలేదు. అదే టైమ్ లో వాయనాడ్ లో కూడా పోటీ చేయడం… అక్కడ 4 లక్షల 30 వేల ఓట్ల మెజారిటీతో గెలవడంతో రాహుల్ పరువు దక్కింది.
వాయనాడ్ లో కాంగ్రెస్ కార్యకర్తల బలం స్ట్రాంగ్ గా ఉండటంతో రాహుల్ కు బంపర్ మెజారిటీ వచ్చింది. మరో 3 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారు. ఆయన తిరిగి వాయనాడ్ నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్ ఎంపీ కే.మరళీధరన్ ప్రకటించారు. కేరళ సిట్టింగ్ ఎంపీలంతా కన్నూర్ మినహా మిగిలిన ప్రాంతాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాహుల్ సీటు విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు మురళీధరన్.
కానీ వాయనాడ్ నుంచి ఈసారి సీపీఐ పోటీ చేయాలని భావిస్తోంది. సీట్ల పంపకాల్లో భాగంగా అధికార LDF కూటమిలో భాగస్వామ్య పక్షం సీపీఐకి వాయనాడ్ తో తో పాటు నాలుగు సీట్లు కేటాయించారు. ఆ స్థానం ఖాళీ చేయాలని కాంగ్రెస్ ను ఇప్పటి వరకూ కోరలేదనీ… భవిష్యత్తులో కోరే అవకాశాలు ఉన్నట్టు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా చెప్పారు. రాహుల్ మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే… వాయనాడ్ లో సీపీఐ జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి. రాజా భార్య అయిన అనీ రాజాను నిలబెట్టాలని చూస్తున్నారు. కేరళ LDFలో సీట్ల పంపకాలపై కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కాంగ్రెస్ తో చర్చించాక… రాహుల్ వాయనాడ్ ను వదులుకుంటారా… అక్కడే పోటీ చేస్తారా అన్నది తేలనుంది.
రాహుల్ గాంధీ వాయనాడ్ తో పాటు మళ్ళీ అమేథీ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది డౌట్ గా మారింది. గతంలో స్మృతి ఇరానీ ఆయన్ని అమేథీలో ఓడించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. పైగా ఈమధ్యే అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగింది. ఈ పరిస్థితుల్లో యూపీలో మెజారిటీ లోక్ సభ సీట్లు కమలం పార్టీకే వచ్చే అవకాశాలున్నాయి. పైగా అయోధ్య బాలక్ రామ్ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయ్ కాట్ చేయడంతో… ఆ రాష్ట్రంలో ఇదే ఇష్యూ హైలెట్ గా నిలవనుంది. అందువల్ల రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా వాయనాడ్ ఒక్క చోటే పోటీ చేస్తారని భావిస్తున్నారు.