AP Assembly Elections : అన్నా గౌరవంగా తప్పుకోండి..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ముందే వేట మొదలుపెట్టింది వైసీపీ. గెలిచే అవకాశంలేని.. సర్వేల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను ముందే తొలగిస్తోంది. ఇప్పటికే 11 మంది ఇంఛార్జులను మార్చిన జగన్.. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మారుస్తారని తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి అభ్యర్థులను మారిస్తే వాళ్ళు ఫీలవుతారని.. అన్నా గౌరవంగా తప్పుకోండి అంటూ గ్రాఫ్ లేని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు.

175 సీట్లల్లో గెలిచి తీరుతాం.. అని వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ లీడర్లు ముందు నుంచీ చెబుతున్నారు. కానీ తెలంగాణలో BRSకి లాగా ఏపీలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తోడైతే ఓడిపోతామన్న భయం వైసీపీకి పట్టుకుంది. అందుకే జగన్ ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారు. నియోజకవర్గవర్గాల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్స్ ను తొలగించి.. కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి 11 మంది ఇంఛార్జులను మార్చారు. ఇంకా 10మంది మంత్రులతో సహా 60 మంది దాకా సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలకు స్థానచలనం తప్పేలా లేదు.

మొన్న కొంతమందిని మార్చాక.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. తమను మారిస్తే ఇలాగే పార్టీ నుంచి వెళ్ళిపోతామని మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు డిసైడ్ అయ్యారట. దాంతో నియోజకవర్గాల్లో వైసీపీలో గ్రూపులు పెరిగిపోతే అసలుకు మోసం వస్తుందని హైకమాండ్ లో భయం పట్టుకుంది. అందుకే జగన్ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. అన్నా మీరే గౌరవంగా తప్పుకోండి.. గెలిచేవారికి మీ స్థానాల్లో అవకాశం ఇద్దాం.. అంటూ గ్రాఫ్ మంచిగా లేని సిట్టింగ్స్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. అధిష్టానం టికెట్ ఇవ్వలేదని చెప్పొద్దు.. మీ వ్యక్తిగత కారణాలతోనే పోటీకి దూరంగా ఉన్నామని ప్రజలకు చెప్పాలని కూడా జగన్ రిక్వెస్ట్ చేస్తున్నారట. మళ్ళీ ఎన్నికల్లో గెలిచాక ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి పదవులు ఇస్తానని బుజ్జగిస్తున్నారు. టికెట్ ఇవ్వలేని ఎమ్మెల్యేలందరికీ సీఎం జగన్ ఇదే విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సారి టిక్కెట్లు ఇవ్వకుండా తమను తప్పిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నా.. మరికొందరు మాత్రం ఏం చేస్తాం.. వేరే పార్టీకి వెళ్ళినా ఇదే పరిస్థితి.. అదేదో వైసీపీలోనే కంటిన్యూ అయితే పోలా.. మళ్ళీ అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీ, రాజ్యసభకో లేదంటే.. కనీసం కార్పొరేషన్ ఛైర్మన్ అయినా తీసుకోవచ్చు అని అడ్జెస్ట్ అయిపోతున్నారు. మరికొందరు కినుకు వహించారు. మరి ఇప్పుడు గౌరవంగా తప్పుకోవాలని జగన్ చేసిన విజ్ఞప్తికి.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి.