Parliament Building: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు.. మరి ఏ పార్టీలు హాజరవుతాయంటే..?

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షానికి చెందిన 19 పార్టీలు ప్రకటించాయి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభం విషయంలో ఒక్క మాటపై ఉంటే.. కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 05:13 PM IST

Parliament Building: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షాలు ప్రకటించాయి. మోదీ, బీజేపీ ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పార్టీలు ప్రకటించాయి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అయితే, రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ ఈ భవనాన్ని ప్రారంభించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యాన్ని మోదీ అపహాస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాష్ట్రపతితోనే భవనాన్ని ప్రారంభింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. “పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రశ్నించినప్పుడు సభ్యులను సస్పెండ్ చేశారు. వారి మాటలను దేశం వినకుండా చూశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పార్లమెంట్‌లో పాటించనప్పుడు.. కొత్త భవనంలో మాకు విలువ ఉంటుందనుకోవడం లేదు. అందుకే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం” అని విపక్షాలు తమ ప్రకటనలో తెలిపాయి. ప్రతిపక్షానికి చెందిన 19 పార్టీలు సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం.
తేలని బీఆర్ఎస్ వైఖరి
బీజేపీని, మోదీని నిరంతరం విమర్శించే బీఆర్ఎస్ ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. మోదీని శత్రువులా భావించే కేసీఆర్ ఈ విషయంలో ప్రతిపక్షాలతో కలిసి వెళ్లడం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభం విషయంలో ఒక్క మాటపై ఉంటే.. కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇదే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో అందరికంటే ముందుగా తన వైఖరి వెల్లడించాల్సిన కేసీఆర్ ఇంకా కాలయాపన చేస్తుండటం విశేషమే. ఈ అంశంపై గురువారం చర్చించి, నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఏదేమైనా ఈ విషయంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయం బీజేపీపై ఆ పార్టీ వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది.
తెలుగు రాష్ట్ర పార్టీల మద్దతు
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి మద్దతు లభించినట్లే ఉంది. కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన పార్టీల్లో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్, ఏపీకి చెందిన టీడీపీ, వైఎస్సార్సీపీ లేవు. టీడీపీ తరఫున ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే వైఎస్సార్సీపీ హాజరవుతున్నట్లే. బీఆర్ఎస్ మాత్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి బీజేపీతోపాటు మిత్రపక్షాలు (ఎన్‌డీఏ కూటమి) హాజరవుతున్నాయి. అలాగే ఒడిశా నుంచి బిజూ జనతా దళ్ (బీజేడీ) హాజరవుతోంది.
ఏ పార్టీలు బహిష్కరించాయి?
ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ, ఉద్ధవ్‌కు చెందిన శివసేన, డీఎంకే, ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (మణి), సీపీఐ, జేఎంఎం, వీసీకే, ఎన్సీపీ, సీపీఎం, ఆర్ఎల్‌డీ, జేడీ (యూ), ఆర్‌జేడీ, టీఎంసీ, ఐఎంయూఎల్, ఆర్ఎస్‌పీ, ఎండీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
బీజేపీ ఆగ్రహం
ప్రతిపక్షాల నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్ఫూర్తి, దేశాభివృద్ధి విషయంలో గర్వించే తత్వం లోపించిందని బీజేపీ విమర్శించింది. గతంలో పార్లమెంట్ అనుబంధ భవనాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారని, ఆ తర్వాత పార్లమెంటులో లైబ్రరీకి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శంకుస్థాపన చేశారని బీజేపీ గుర్తు చేసింది. ప్రధానులుగా ఉన్న వాళ్లు ప్రారంభోత్సవాలు చేయగాలేనిది.. ఇప్పుడు చేస్తే తప్పేంటని బీజేపీ ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు పునరాలోచన చేయాలని బీజేపీ సూచించింది. అయితే, రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకోవడం విచారకరం.