హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫేమస్సో.. బాలాపూర్ గణేషుడు లడ్డూ అంతే ఫేమస్. వినాయకచవితి వచ్చిందంటే చాలు.. బాలాపూర్ గణేషుడి లడ్డూ గురించి చర్చ జరుగుతుంటుంది. ఎవ్రీ ఇయర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతుంటాయ్. ఈసారి కూడా అలాంటి క్యూరియాసిటీనే కనిపించింది. ఎంతో ప్రత్యేకత ఉన్న బాలాపూర్ గణేశుడి లడ్డూ.. మరోసారి రికార్డు రేటు పలికింది. బాలాపూర్ లడ్డూ వేలం పాటలో కొలన్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈసారి కూడా ఆ కొలన్ కుటుంబానికే లడ్డూ దక్కింది. 30 లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి 3లక్షల వెయ్యి రూపాయలు ఎక్కువగా లడ్డూకు ధర పలికింది.
వేలం తర్వాత కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు. వెయ్యి నూట పదహారు రూపాయలతో వేలం ప్రారంభం కాగా.. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని… తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధన తీసుకువచ్చారు. వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధనను పెట్టారు. గతేడాది 27 లక్షలు పలకగా.. ఆ మెుత్తాన్ని డిపాజిట్ చేసిన భక్తులు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు కొలను శంక రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూను ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ వెళ్లి మోదీకి పూర్తి లడ్డూను అందజేస్తానని చెప్పారు. శంకర్ రెడ్డి స్థానిక బీజేపీ నేత. ప్రస్తుతం ఆయన సింగిల్ విండో ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వేలంలో పాల్గొన్న ఆయన.. లడ్డూను ప్రధానికి అందజేస్తానని చెప్పారు. ఇక బాలాపూర్ గణేషుడి మొదటి లడ్డూను.. 1994లో కొలన్ కుటుంబానికి చెందిన మోహన్ రెడ్డి 450 రూపాయలు దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో మెజారిటీ ఆ కుటుంబానిదే. ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన శంకర్ రెడ్డి.. లడ్డూ దక్కించుకున్నారు.