ప్రతిపక్ష నేతలను టార్గెట్ గా చేసుకొని BRS సర్కార్ లోని పెద్దలు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ సామాన్యుల సంసారాల్లోనూ నిప్పులు పోసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ తో అడ్డంగా దోచుకున్నారు కొందరు పోలీస్ అధికారులు. మేడలు, మిద్దెలు కట్టుకొని ఎంజాయ్ చేశారు. సినిమా హీరోయిన్లను కూడా వేధించినట్టు వార్తలు వచ్చాయి. ఓ కానిస్టేబుల్ అయితే ఏకంగా 40 మంది మహిళను లైంగికంగా వేధించినట్టు బయటపడింది. ఎవరో ఏదో చేస్తే మాకేం సంబంధం అని అప్పటి ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవచ్చు గానీ… మీరు సృష్టించిన SIB లో ఇన్ని దారుణాలు జరిగితే బాధ్యులెవరని జనం ప్రశ్నిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కోసం మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలను యూనిట్ గా చేసుకొని నల్లగొండ టౌన్ లో సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాల్లో ప్రతి పక్షనేతలు, వారి బంధువుల ఫోన్లను టార్గెట్ చేశారు. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో నల్లగొండలో SPగా పనిచేశారు. అక్కడ పరిచయమైన కానిస్టేబుల్ ను SIB టీమ్ లో చేర్చుకున్నారు. ఇక ఆ కానిస్టేబుల్ చెలరేగిపోయాడు. పొలిటికల్ లీడర్స్, వ్యాపారుల ఫోన్లే కాదు… భార్యా భర్తల ఫోన్లు కూడా విన్నాడు. ఆ ఫోన్ సంభాషణలను అడ్డం పెట్టుకొని… ఏకంగా 40 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ కానిస్టేబుల్.
ట్యాపింగ్ తో మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించాడు. ఇందులో సామాన్య మహిళలతో పాటు ఉద్యోగినులు కూడా ఉన్నారు. పోలీస్ బాస్ ల అండతో ఆ కానిస్టేబుల్ మహిళలపై దారుణంగా తెగబడినట్టు తెలుస్తోంది. ఇతడి బాధితుల్లో కొందరు మహిళలు ఇప్పుడిప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
నల్లగొండ జిల్లాలో ఓ రౌడీ షీటర్ ద్వారా ఈ కానిస్టేబుల్ సెటిల్ మెంట్స్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మహిళా వేధింపులు, దందాల కోసం ఆ కానిస్టేబుల్ 9 సిమ్ కార్డులు వాడినట్టు గుర్తించారు. అంతేకాదు… గుర్రంపోడులో మాజీ పోలీస్ బాస్ బినామీలకు 9ఎకరాల భూమిని కూడా ఇప్పించాడా కానిస్టేబుల్. మరో పోలీస్ కానిస్టేబుల్ తో కలసి వందల మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. మిల్లర్లను బెదిరించి నెలవారీ మామూళ్ళు వసూలు చేయడం, పేకల శిబిరాల నిర్వాహకుల దగ్గర కూడా భారీగా వసూళ్ళకు పాల్పడినట్టు కానిస్టేబుల్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ … ఆ ఇద్దరు అరాచక కానిస్టేబుల్స్ ని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.