BRS Party: గోషామహల్ కోసం ‘గులాబీ’ తోటలో ఫైట్.. 8 మందిలో ఛాన్స్ ఎవరికి ?

గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ కోసం అన్ని పార్టీల నుంచి చాలా డిమాండ్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో కాస్త ఎక్కువ కనిపిస్తోంది. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 01:57 PM IST

ఉత్తర భారతీయులు అధికంగా ఉండే గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఆ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై హాట్ డిబేట్ జరుగుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 82 వేల మందికి పైగా ఓటర్లు ఉండగా, వీరిలో సగానికిపైగా సెటిలర్సే. ఇక్కడ.. గెలుపోటములను నిర్ణయించేది కూడా వాళ్లే. ఇటువంటి కీలకమైన టికెట్ కోసం పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రేసులో గులాబీ దళం యువనేతలు ఆశిష్ కుమార్ యాదవ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. నందకిశోర్ వ్యాస్, ముఖేష్ సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్, గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, రాజశేఖర్‌, మమత సంతోష్‌ గుప్తా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆశిష్ కుమార్ యాదవ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్ లు వేర్వేరుగా సీఎం కేసీఆర్ ను కలిసి ఇటీవల ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. తమకు టికెట్ ఇస్తే గత పదేళ్లుగా కమల దళం చేతిలో ఉన్న గోషా మహల్ ను గులాబీ కోటగా మారుస్తామని ఈ నేతలంతా కారు పార్టీ అధినాయకత్వానికి చెప్పారట.

ఆశిష్ కుమార్ యాదవ్ కు బీఆర్ఎస్ లో ప్రస్తుతానికి ఎలాంటి పార్టీ పదవి లేదు. అయినా నియోజకవర్గవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ఆయన దూసుకుపోతున్నారు. అయితే ఇవి మాత్రమే ఆశిష్ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసేందుకు దోహదపడకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కట్టెల శ్రీనివాస్ యాదవ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇది ఆయనకు ప్లస్ పాయింట్ గా మారే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్​ గోషామహల్ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న నంద్ కిశోర్ వ్యాస్ కు, ఆ పార్టీ స్థానిక సీనియర్ నాయకులకు అస్సలు పడటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇన్​చార్జ్​గా బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి నంద్ కిశోర్ వ్యాస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. పలువురు మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, మాజీ నియోజకవర్గ ఇన్​చార్జ్ ఇటీవల నందకిశోర్​కు వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. ఇన్​చార్జ్ ​వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు నంద్ కిశోర్ కు మైనస్ పాయింట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత ​సంతోశ్ గుప్తా సొంతంగా మరో ఆఫీసును ప్రారంభించడం పార్టీ వర్గాలు చర్చనీయాంశంగా మారింది.

ఇక గోషామహల్ బీజేపీ టికెట్ రేసులో ఇద్దరు, ముగ్గురు కీలక నేతలున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు, జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న శంకర్ యాదవ్.. కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు.. గోషామహల్‌పై రాజకీయంగా పట్టున్న వారు కావడంతో.. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ రాజాసింగ్‌ను ఎంపీగా బీజేపీ పోటీ చేయిస్తుందని.. దాంతో తమకే పోటీ చేసే అవకాశం వస్తుందని ఈ ఆశావహ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే.. గోషామహల్ నుంచి మెట్టు సాయికుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ బీజేపీలో చేరడం మెట్టు సాయికి కలిసొస్తుందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది.