ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్టీని గాడిన పెట్టే పనితో పాటు తన రాజకీయ భవిష్యత్తును భద్రం చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఆమె విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. గతంలో ఆమె అక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవలి వరకూ ఆమెకు సీటుపై క్లారిటీ లేనప్పటికీ మారుతున్న పరిణామాలు ఆమెలో జోష్ నింపుతున్నాయి. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 2014 నాటి ఫలితం రిపీట్ అవుతుందని ఆమె నమ్ముతున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా స్థానిక టీడీపీ కేడర్ నుంచి కూడా మద్దతు దొరుకుతుందని ఆమె అంచనా వేస్తున్నారు. జగన్ హవా నడిచిన 2019 ఎన్నికల్లోనూ విశాఖలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగింది. దీంతో ఈసారి విశాఖలో అయితే గెలుపు కోసం అంత కష్ట పడక్కర్లేదన్నది పురంధేశ్వరి ఆలోచన.
పురంధేశ్వరి ప్లాన్స్ ఇలా ఉంటే ఆమెకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు రూపంలో గట్టి పోటీనే ఎదురవుతోంది. ఆయన చాలాకాలంగా విశాఖ ఎంపీ సీటుపై కన్నేశారు. దానికి తగినట్లుగా గ్రౌండ్‌వర్క్ కూడా చేసుకుంటున్నారు. వచ్చే ఏడాదితో జీవీఎల్ పదవీకాలం ముగుస్తుంది. మళ్లీ పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కుతుందో లేదో తెలియదు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోనే పోటీ చేసి నెగ్గాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తరాది ఓటర్లు కాస్త ఎక్కువగా ఉండే విశాఖ అయితే తనకు సేఫ్ సీట్ అని ఆయన భావించారు. అందుకే విశాఖ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే నార్త్ ఇండియన్ ఓటర్లకు కనెక్ట్ అయిన జీవీఎల్.. ఇప్పుడు ఈబీసీల మీద ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలో ఆర్ధికంగా వెనుకబడ్డ, బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న తూర్పు కాపులు, ఇతర సామాజిక వర్గాల సమస్యల ను భుజానకెత్తుకున్నారు. తనకు హైకమాండ్ మద్దతు కూడా ఉందని జీవీఎల్ చెప్పుకుంటున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఇటీవల జీవీఎల్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన అనుచరులు పూలవర్షం కురిపించి నానా హంగామా చేశారు. ఇటీవల పురంధేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా విశాఖలో అడుగుపెట్టినప్పుడు ఆమె మద్దతుదారులు కూడా హడావుడి చేశారు. మంగళహారతులు, థింసా డ్యాన్స్, ర్యాలీ ఇలా హంగామా సృష్టించారు. దీని ద్వారా ఆమె విశాఖ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారానికి మరింత ఊపునిచ్చారు. ఇప్పుడు పురంధేశ్వరి కూడా పోటీకి వచ్చే అవకాశం ఉండటంతో జీవీఎల్ మరింత యాక్టివ్ అయినట్లు చెబుతున్నారు. పురంధేశ్వరి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని అది కూడా తన సొంత నియోజకవర్గం పర్చూరులోనే చేస్తారని బీజేపీలోని ఓ వర్గం అంటోంది. అయితే జాతీయ స్థాయిలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమె చూపంతా ఢిల్లీపైనే ఉందని.. అందుకే ఎంపీగా పోటీ చేస్తారని బీజేపీలోని మరో వర్గం చెబుతోంది. అటు పురంధేశ్వరి, ఇటు జీవీఎల్ ఇద్దరి మధ్య టిక్కెట్టు పోటీ రంజుగానే కనిపిస్తోంది. ఎవరూ నేరుగా తమ ఆకాంక్ష చెప్పకపోయినా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు. మరి ఈ ఇద్దరిలో బీజేపీ హైకమాండ్ ఎవరివైపు మొగ్గుచూపుతుంది అన్నది చూడాల్సి ఉంది.