Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే, సీఐడీ కోరినట్లు ఐదు రోజులు కాకుండా.. రెండు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. చంద్రబాబును విచారణ ఎక్కడ చేస్తారని కోర్టు ప్రశ్నించింది. జైలులో చేస్తారా.. లేక తటస్థ ప్రదేశంలో విచారిస్తారా అని కోర్టు.. సీఐడీ తరఫు లాయర్లను అడిగింది. ఈ విషయంలో సీఐడీ చెప్పే సమాధానాన్నిబట్టి ఆదేశాలిస్తామని పేర్కొంది. దీనికి సమాధానమిచ్చిన సీఐడీ.. చంద్రబాబును జైల్లోనే విచారిస్తామని చెప్పింది. దీనికి కోర్టు అంగీకరించింది. ఉదయం 09:30 గంటల నుంచి సాయంత్రం ఐదు 05:00 వరకే విచారించాలని సూచించింది.
చంద్రబాబు సమాధానాలు చెబితేనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిజాలు బయటకు వస్తాయని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. చంద్రబాబును ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీన్ని చంద్రబాబు తరఫు లాయర్లు వ్యతిరేకించారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర లేదని, ఆయనకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని వాదించారు. దీన్ని సీఐడీ తరఫు లాయర్లు వ్యతిరేకించారు. ఆయనకు వ్యతిరేకంగా అసరమైన సాక్షాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేశామని, పూర్తి విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శుక్రవారం రోజే చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టు నుంచి పలు నిర్ణయాలు వెలువడ్డాయి. చంద్రబాబు రిమాండ్ పిటిషన్‌లో ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం వెల్లడైంది.
చంద్రబాబు రిమాండ్‌ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో సీఐడీ అధికారులు చంద్రబాబును అదుపులోకి తీసుకుని, రెండు రోజులపాటు విచారించనున్నారు. మరోవైపు ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీకి అప్పగించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టులో లిస్టింగ్ అయింది.