CHANDRABABU NAIDU: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. నవంబర్ 1 వరకు ఆయన రిమాండ్ పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గతంలో చంద్రబాబుకు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో గురువారం ఈ అంశంపై విచారణ జరిగింది. ఈ విచారణకు చంద్రబాబు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైలులో పరిస్థితులపై చంద్రబాబును న్యాయమూర్తి అడిగారు.
అక్కడి పరిస్థితులు, ఆయన ఇబ్బంది గురించి తెలుసుకున్నారు. తన భద్రత విషయంలో అనుమానాలున్నట్లు జడ్జికి చెప్పారు చంద్రబాబు. ఈ అంశంపై తనకు రాతపూర్వకంగా వివరాలు అందజేయాలని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు ఇచ్చే వివరాల్ని తనకు అందజేయాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు. ఇటీవల చంద్రబాబు పలు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు. ఆయన హెల్త్ రిపోర్టులు తనకు పంపించాలని అధికారులకు సూచించారు. వాటిని ఇచ్చేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తమకు ఇవ్వాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.
మరోవైపు తాజాగా రిమాండ్ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1 వరకు పొడిగించింది. దీంతో దసరాను చంద్రబాబు జైల్లోనో జరుపుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉండటం, హైకోర్టులో బెయిల్ పిటిషన్ అంశం ఎటూ తేలకపోవడంతోనే ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ పొడిగించింది. ఈ రోజే చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.