Chandrababu Naidu: చంద్రబాబు నాయుడును హౌజ్ రిమాండ్‌లో ఉంచేందుకు అనుమతివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీర్పు మంగళవారానికి వాయిదాపడింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం జైలులో ఉన్న చంద్రబాబును వయసు, ఇతర కారణాల రీత్యా హౌజ్ అరెస్టుకు అనుమతించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై సోమవారం విచారణ సాగింది. ఇరుపక్షాలు ఈ అంశంపై వాడివేడిగా స్పందించాయి. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏజీ శ్రీరామ్ వాదించారు. చంద్రబాబుకు జైలు సేఫ్ కాదని, ఇంతకాలం ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉందని లూథ్రా అన్నారు. అక్కడ కరుడుకట్టిన నేరగాళ్లు ఉన్న దృష్ట్యా, చంద్రబాబు భద్రత దృష్ట్యా ఆయన హౌస్ రిమాండ్‌కు అనుమతివ్వాలని కోరారు. చంద్రబాబు సెక్యూరిటీపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ అమలులో ఉందని, ఆయనకు కేంద్రం హైసెక్యూరిటీ కల్పించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఈ ప్రతిపాదనను సీఐడీ తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు.
సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ అనేదే లేదని, చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన భద్రతపై అన్ని చర్యలు తీసుకున్నామని సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, జైలులో పూర్తి భద్రత ఉందని లాయర్లు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువర్గాల న్యాయవాదులు మంగళవారం కోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో చంద్రబాబు హౌజ్ రిమాండ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది.