MLA Raghunandan rao: తెలంగాణ బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. కొంతకాలంగా పార్టీలోని నేతలు అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. నిన్నామొన్నటివరకు ఈటల, కోమటిరెడ్డి ఈ విషయంలో ముందుండగా.. ఇప్పుడు రఘునందన్ రావు నుంచి నిరసన గళం వినిపిస్తోంది. పార్టీలో తనకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను పార్టీ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. తనను రాష్ట్ర కమిటీతోపాటు కేంద్ర కమిటీ కూడా పట్టించుకోవడం లేదన్నారు. తనకున్న వాక్చాతుర్యానికి పార్టీ జాతీయస్థాయి ప్రతినిధిగా (స్పోక్స్ పర్సన్) పదవి అడిగినా ఇవ్వలేదని, కనీసం రాష్ట్రంలో ఫ్లోర్ లీడర్ పదవి అడిగినా ఇవ్వడం లేదన్నారు. గతంలో ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాజా సింగ్‌కు సంబంధించి కేసుల వ్యవహారం ఉండటంతో, ఆ పదవిని తనకు ఇమ్మని అడిగినా స్పందన లేదన్నారు. స్వయంగా రాజా సింగే తన పదవి తీసుకోవాలని సూచించినా నాయకత్వం తనకు పదవి అప్పగించడ లేదని ఆవేదన చెందారు. ఒక పార్టీకి ఫ్లోర్ లీడర్ లేకుండా, అసెంబ్లీలో ఆ పార్టీ ఎలా పనిచేస్తుంది అంటూ ఆయన ప్రశ్నించారు. కొత్తగా పార్టీలో చేరిన ఈటల రాజేందర్‌కు కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చోటు దక్కిందని, అలాగే విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు చోటు కల్పించినప్పటికీ పార్టీ తనను విస్మరించిందన్నారు. ఇలాంటి అనేక ఇబ్బందులు, అవమానాలు తనకు ఉన్నాయన్నారు.
తదుపరి వ్యూహం ఏంటి..?
ప్రస్తుతం రఘునందన్ రావుకు పార్టీలో ఎలాంటి పదవీ లేదు. పైగా ఇతర కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతకుముందు నిత్యం మీడియాలో కనిపిస్తూ, బీజేపీ తరఫున బలమైన వాదన వినిపించేవారు. పార్టీపై ఏ విమర్శలొచ్చినా తిప్పికొట్టడంలో ఆయన సమర్ధుడు. అలాంటిది ఆయన ఇటీవలి కాలంలో ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో బీజేపీ పెద్దలు, బండి సంజయ్‌పై ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారేమో అనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ, ఈ విషయంలో రఘునందన్ రావు నుంచి ఎలాంటి స్పష్టమైన వివరణ లేదు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు తొలగిపోకుంటే నేతలు బీజేపీని వీడటం ఖాయం. ఇప్పటికే ఈటల, జితేందర్ రెడ్డి వంటి నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. పార్టీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరికొంతమంది నుంచి కూడా ఇదే తరహా తిరుగుబాటు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.