AIADMK: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి ఆలిండియా ద్రవిడ మున్నేట్ర కఝగం (ఏఐఏడీఎంకే) పెద్ద షాకిచ్చింది. ఎన్డీఏ నుంచి బయటికి వస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ సభ్యులందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆ పార్టీ ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు పార్టీ నేతలు. చాలా కాలం నుంచి తమిళనాడులో బీజేపీ నేతలకు, ఏఐఏడీఎంకే నేతలకు మధ్య సంబంధాలు బాలేవు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
కొన్ని సందర్భాల్లో ఈ విమర్శలు రాజకీయాలు దాటి వ్యక్తిగతంగా వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు జయలలిత చనిపోయిన తరువాత పళనిస్వామి వర్గాన్ని మోదీనే కంట్రోల్ చేస్తున్నారనే టాక్ తమిళనాడులో ఉంది. పేరుకు అలయన్స్‌లో ఉన్నా.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ నేతల డామినేషన్ ఎక్కువైందని పళనిస్వామి వర్గం భావించింది. సీఎం సీటు విషయంలో కూడా బీజేపీతో విభేదాలు తప్పవని ముందే ఊహించింది. నిజానికి డీఎంకే, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏఐఏడీఎంకే ఎన్డీఏలో ఉండటానికి ఇదే ముఖ్య కారణం. కానీ అధికారం విషయానికి వస్తే బీజేపీ డీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. బీజేపీని కాదని ఏఐఏడీఎంకే సీఎం సీట్లో కూర్చుంటే.. డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టే చాన్స్ కూడా ఉంది.
ఇప్పటికే మహారాష్ట్రలో ఇదే పని చేసింది బీజేపీ. చాన్స్ దొరికితే తమిళనాడులో కూడా ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. దీంతో ముందుగానే సేఫ్‌జోన్‌లో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు తమిళనాడులో బీజేపీ అడుగులు ఎలా ఉండబోతున్నాయనే విషయం ఆసక్తిగా మారింది.