AIMIM: ఎంఐఎం ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుంది..? బీఆర్ఎస్‌తో ఒప్పందం ప్రకారమే పోటీనా..?

తెలంగాణలో ఎంఐఎం పాత్ర చాలా కీలకం. ఈ పార్టీ మెజారిటీ సీట్లు సాధించకపోయినప్పటికీ.. ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలదు.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 02:13 PM IST

AIMIM: తెలంగాణలో ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అనే అంశంపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్‌కు, ఎంఐఎంకు మధ్య స్నేహపూర్వక అవగాహన ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే రెండు పార్టీలూ.. పొత్తు పెట్టుకోకపోయినా.. పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎంఐఎం కోరుకున్న స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతిస్తుంది. ఇక మిగిలిన స్థానాల్లో ఎంఐఎం సహకరిస్తుంది. రెండు పార్టీలూ.. పరస్పర సహకారంతో కావల్సిన సీట్లు గెలుచుకుంటాయి.
తెలంగాణలో ఎంఐఎం పాత్ర చాలా కీలకం. ఈ పార్టీ మెజారిటీ సీట్లు సాధించకపోయినప్పటికీ.. ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలదు. ఎంఐఎం మద్దతు ఉంటే ఏ పార్టీ అయినా అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. గతంలో వైఎస్ హయాంలో ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. అందువల్లే అప్పట్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచింది. ఆ తర్వాత బీఆర్ఎస్‌కు మద్దతిచ్చింది. దీంతో బీఆర్ఎస్ కూడా అధికారంలోకి రాగలిగింది. అందుకే ఎంఐఎం సహకారం ఇతర పార్టీలకు అవసరం.

ప్రస్తుతం ఎంఐఎం బీఆర్ఎస్‌తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. పొత్తులు, సీట్ల విషయంలో రెండు పార్టీలు కలిసే నడుస్తాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనే పోటీ చేయబోతుంది. ఈ స్థానాల్లో బీఆర్ఎస్.. ఎంఐఎంకు మద్దతిస్తుంది. మిగతా చోట్ల బీఆర్ఎస్‌కు ఎంఐఎం అండగా ఉంటుంది. బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఓటేయాల్సిందిగా తమ శ్రేణులకు ఆదేశాలిస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఎంఐఎం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల్నిబట్టి పార్టీ అధినేత అసదుద్దీన్ నిర్ణయం తీసుకుంటారు.
ముస్లిం ఓట్లను ఎంఐఎం ప్రభావితం చేయగలదు. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నచోటే ఎంఐఎం విజయం సాధిస్తుంది. పూర్తి మెజారిటీ లేని చోట బీఆర్ఎస్‌కు మద్దతిచ్చింది. ఎన్నికల్లో ఏడు చోట్ల ఎంఐఎం తప్పకుండా గెలుస్తుంది. అయితే, తమ పార్టీ కూడా తెలంగాణలో విస్తరించాలనుకుంటోందని గతంలో అసదుద్దీన్ చెప్పారు. అవసరమైతే తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు లేదు.