Sharad Pawar: ఎన్సీపీకి హ్యాండ్‌ ఇచ్చిన అజిత్‌ పవార్‌..

మహారాష్ట్రలో మరోసారి రాజకీయ ప్రకంపణలు రేగాయి. చాలా రోజుల నుంచి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తుడిగా ఉన్న అజిత్‌ పవార్‌ ఆ పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వీళ్లందరితో కలిసి ఎన్డీయేలో చేరారు.

  • Written By:
  • Publish Date - July 2, 2023 / 05:35 PM IST

ప్రస్తుతం ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 30 మంది అజిత్‌ పవార్‌తో వచ్చేశారు. అజిత్‌ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు 9 మందికి మంత్రి పదవులు దక్కబోతున్నట్టు సమాచారం. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్నట్టు ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ రీసెంట్‌గా ప్రకటించారు. కానీ ఎమ్మెల్యేల డిమాండ్‌తో ఆయనే అధ్యక్షుడిగా కొనసాగారు. పార్టీకి ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమించారు. ఆ రెండు పదవుల్లో ఒక పదవి తనకు వస్తుందని అజిత్‌ పవార్‌ అనుకున్నారు. కానీ సుప్రియా సూలే, ప్రఫుల్‌ పటేల్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించారు శరద్‌ పవార్‌. అప్పటి నుంచి పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్న అజిత్‌ పవార్‌ టైం చూసి పార్టీకి హ్యాండ్‌ ఇచ్చాడు.

రీసెంట్‌గానే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్‌ సమావేశం నిర్వహించారు. తాను ఎన్డీయేలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఇవాళ నేరుగా వెళ్లి మహారాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. అజిత్‌ పవార్‌ వెళ్లిన కాసేపటికే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే కూడా రాజ్‌ భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినట్టు సమాచారం. దీంతో శివసేన తరువాత భారీ చీలిక ఏర్పడ్డ మరో పార్టీగా ఎన్సీపీ నిలిచింది.