Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గత ఏడాది ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన నేతలు బీజేపీలో చేరగా.. తాజాగా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయారు. ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇది నిజంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు షాకేనా..? లేక ఆయనకు తెలిసే జరిగిందా..? మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)గా పేర్కొంటున్న కాంగ్రెస్-శివసేన-కూటమి చీలిపోయినట్లేనా..?
ఏడాది కూడా కాకముందే మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి కుదుపునకు గురయ్యాయి. ఎన్సీపీలో తిరుగుబాటు నేతగా ఉన్న శరద్ పవర్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలోని బీజేపీ-శివసేన (రెబల్) ప్రభుత్వంలో చేరిపోయారు. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 43 మంది ఎమ్మెల్యేలు అజిత్ వైపే ఉన్నారు. ఈ నేపథ్యంలో అజిత్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిపి అజిత్ కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగుతారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ ”ఎన్సీపీలో ఎలాంటి చీలికా లేదు. పార్టీలోని ఎమ్మెల్యేందరి మద్దతూ నాకే ఉంది. కొందరు విదేశాల్లో ఉండటం, మరికొందరు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. గతంలో శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసున్నాం. ఇప్పుడు బీజేపీ-శివసేన (షిండేవర్గం)తో ఉంటున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తులు. ఎవరితో ఉంటున్నామన్నది ముఖ్యం కాదు” అని వ్యాఖ్యానించారు. నిన్నా మొన్నటివరకు తమది డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకొన్న బీజేపీ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కారు అంటోంది. ఎన్సీపీ చేరికతో తమ ప్రభుత్వం మరింత బలపడిందని, షిండే శివసేన-బీజేపీ-ఎన్సీపీతో కలిసి ట్రిపుల్ ఇంజిన్ సర్కారుగా మారిందని చెప్పుకొచ్చింది.
సీఎం పదవిపై కన్నేసి.. చివరకు డిప్యూటీ సీఎంగా
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేనను చీల్చి, షిండేతో తిరుగుబాటు చేయించి, ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీ. తర్వాత షిండే వర్గ నేతలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సంబంధించి బీజేపీకి ఒక చిక్కొచ్చిపడింది. ఉద్ధవ్-షిండేలలో శివసేన ఎవరిదో అనే అంశంపై కోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో షిండేకు అనుకూలంగా తీర్పు రాకపోతే బీజేపీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. అందుకే బీజేపీ ముందు జాగ్రత్తగా ఎన్సీపీతో చర్చలు జరిపింది. ఒకవేళ షిండేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చి, తిరుగుబాటు ఎమ్మెల్యలతో ఏర్పాటైన ప్రభుత్వం నిలబడకపోతే ఎన్సీపీతో కలిసేందుకు బీజేపీ సిద్ధమైంది. అవసరమైతే అజిత్ పవార్‌ను సీఎం చేసేందుకు బీజేపీ అంగీకరించింది. అందుకే బీజేపీతో కలిసేందుకు అజిత్ అంగీకరించాడు. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ పెద్దలను అజిత్ కలిశాడు. ఈ లోపు అజిత్ తన వర్గం ఎమ్మెల్యేలను సిద్ధం చేశాడు. కానీ, పార్టీ విషయంలో షిండేకు అనుకూలంగా తీర్పు రావడంతో షిండే శివసేన-బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. షిండేకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సీఎం అవుదామని అజిత్ ఆశించగా అది జరగలేదు. అయినప్పటికీ ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీకి మద్దతిస్తూ ఆ ప్రభుత్వంలో చేరిపోయారు. డిప్యూటీ సీఎం అయ్యారు.
శరద్ పవార్‌కు తెలిసే జరిగిందా..? అంతా డ్రామాయేనా..?
పైకి అజిత్ పవార్ తిరుగుబాటు చేసినట్లు కనిపిస్తున్నా నిజానికి అంత సీన్ లేదని అనేక పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అజిత్ బీజేపీలో చేరే విషయం శరద్ పవార్‌కు ముందుగానే తెలుసని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అజిత్, శరద్ పవార్.. ఇద్దరూ కలిసే ఈ పని చేసుండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. కొంతకాలంగా ప్రతిపక్షాలు బీజేపీపై, మోదీపై అనేక అంశాల్లో విమర్శలు చేస్తూ వస్తున్నా శరద్ పవార్ మాత్రం పెద్దగా విమర్శలు చేయలేదు. పైగా చాలా సందర్భాల్లో ప్రతిపక్షాల్నే విమర్శిస్తూ, మోదీకి మద్దతు పలికారు. దేశంలోని సమస్యల్ని లేవనెత్తుతూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే, శరద్ పవార్ మాత్రం ఈ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మోదీకి మద్దతుగా మాట్లాడారు. అంతేకాదు.. శివసేనను షిండే చీల్చినప్పుడు అందరూ బీజేపీని, షిండేను విమర్శిస్తే.. శరద్ పవార్ మాత్రం ఉద్ధవ్ ఠాక్రేపైనే విమర్శలు చేశారు. ఇదంతా ఉద్ధవ్ వైఫల్యమే అని, పార్టీలోని తిరుగుబాటును ఆయన అణచివేయలేకపోయారని, ఆయనకు రాజకీయ చాతుర్యం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. ఇటీవల ఎన్సీపీలో నాయకత్వ మార్పు గురించి తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
అజిత్ పవార్, శరద్ పవార్ కుమార్తే సుప్రియా సూలేకు మధ్య నాయకత్వ సమస్యలొచ్చాయి. ఇద్దరూ తమ పవర్ కోసం ప్రయత్నాలు చేశారు. పార్టీని చేజిక్కించుకునేందుకు చూశారు. ఈ పరిణామాల మధ్య తాను రాజీనామా చేస్తున్నట్లు శరద్ ప్రకటించి, మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తర్వాత నెమ్మదిగా పార్టీలో అంతర్గత కలహాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇదంతా శరద్ పవార్ కావాలని ఆడించిన డ్రామాగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎంవీఏ సర్కారు కూలిపోయిన తర్వాత నుంచే శరద్ పవార్ ఇలా చేస్తూ వచ్చారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాట్లు ఉన్నట్లు నమ్మించారు. దీనికి కారణం.. ఆయన బీజేపీలో చేరాలనుకోవడమే. మొన్నటివరకు కాంగ్రెస్-శివసేనతో ఉండి.. ఉన్నట్లుండి బీజేపీలో చేరితే విమర్శలొస్తాయని, అదే పార్టీలో గందరగోళ పరిస్థితులు సృష్టించి, అజిత్ ద్వారా బీజేపీలో చేరితే సమస్య ఉండదని శరద్ పవార్ ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. అజిత్ ద్వారా ఎన్సీపీ బీజేపీలో చేరేందుకు అవసరమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించాడని అర్థమవుతోంది. శరద్ పవార్ సన్నిహితుడు ప్రఫుల్ పటేల్ కూడా అజిత్‌తోపాటు బీజేపీలోకి వెళ్లాడాన్నిబట్టి కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ, ఎన్డీయేలో చేరే ఒప్పందంలో భాగంగానే ఈ డ్రామా నడిపారు.
ఫ్రపుల్, ఫడ్నవీస్‌కు కేంద్ర మంత్రి పదవులు
ఇప్పటికే మహా ప్రభుత్వంలో బీజేపీ-షిండే ప్రభుత్వంలోని నేతల మధ్య పవర్ కోసం గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీల మధ్యే సఖ్యత లేకుంటే.. ఇక ఎన్సీపీ వంటి మూడో పార్టీ చేరితో లుకలుకలు ఇంకా పెరిగిపోతాయి. అందుకే బీజేపీ అధిష్టానం దీనికో ప్రత్యామ్నాయం ఆలోచించింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. అలాగే ఎన్సీపీలో కీలక నేత ప్రఫుల్ పటేల్‌కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
శివసేన-కాంగ్రెస్‌కు షాక్
షిండే తిరుగుబాటు నుంచి కోలుకుని, తిరిగి పుంజుకోవాలని భావిస్తున్న ఉద్ధవ్ థాక్రే శివసేన, కాంగ్రెస్ పార్టీకి ఎన్సీపీ షాకిచ్చినట్లైంది. తమతో ఉంటుందనుకున్న పార్టీ బీజేపీతో కలిసిపోవడంతో ఎంవీఏ కూటమి బలహీనపడినట్లైంది. ఇది కచ్చింగా ఉద్ధవ్, కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. అయితే, త్వరలోనే షిండేను సీఎంగా తొలగిస్తారని, మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయని ఉద్ధవ్ వర్గం అంటోంది.