Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్.. రేపటి నుంచి అసెంబ్లీ

గత అసెంబ్లీ రద్దైన నేపథ్యంలో నూతన అసెంబ్లీ నియామక ప్రక్రియ సాగాలి. ఇందుకోసం స్పీకర్ అవసరం. పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నికయ్యే వరకు ప్రొటెం స్పీకర్ విధులు నిర్వర్తిస్తారు. ఇందుకోసం అసెంబ్లీలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్లు ప్రొటెం స్పీకర్‌గా పని చేయాలి.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 02:23 PM IST

Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ నూతన ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అక్బరుద్దీన్ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ రద్దైన నేపథ్యంలో నూతన అసెంబ్లీ నియామక ప్రక్రియ సాగాలి. ఇందుకోసం స్పీకర్ అవసరం. పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నికయ్యే వరకు ప్రొటెం స్పీకర్ విధులు నిర్వర్తిస్తారు. ఇందుకోసం అసెంబ్లీలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్లు ప్రొటెం స్పీకర్‌గా పని చేయాలి.

CM REVANTH REDDY: హాస్పిటల్‌లో కేసీఆర్‌.. వైరల్‌ అవుతున్న సీఎం రేవంత్‌ ట్వీట్

ప్రస్తుత అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ఉండే అర్హత కలిగి ఉన్నారు. అయితే, ఆయన ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బదులు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసింది రేవంత్ ప్రభుత్వం. ఆయన ఇప్పటివరకూ ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక.. శనివారం నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత.. వాళ్లంతా కలిసి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అనంతరం విపక్ష నేత, ప్రభుత్వ విప్ ఎంపిక కూడా ఉంటుంది. నూతన ప్రభుత్వం నిర్వహించబోతున్న తొలి అసెంబ్లీ సమావేశాలివే.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీకి సభలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక లాంఛనమే. డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. కాగా.. విపక్ష నేతగా కేసీఆర్ ఉండే అవకాశాలు లేవని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ బదులుగా కేటీఆర్, హరీష్‌లలో ఎవరిని కేసీఆర్ ఎంపిక చేస్తారు అనేది ఆసక్తి కలిగిస్తోంది.