Akhilesh Yadav: కేంద్రంలోని ఓడించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. కూటమి ఏర్పాటు చేయడం సులభమే అయినా.. వివిధ రాష్ట్రాల్లో పార్టీలు కలిసి పని చేయడం మాత్రం కుదరని పని. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు మధ్య విబేధాలున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి మధ్య పోటీ నెలకొంది. ఎస్పీకి ఉత్తర ప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోనూ మంచి పట్టుంది.
దీంతో తమకు కొన్ని సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను ఎస్పీ కోరింది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్‌తో అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల సీట్లు కేటాయించాలని కోరారు. తమకు ఆరు సీట్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తామని చెప్పారని, కానీ, అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని అఖిలేష్ అన్నారు. ఈ విషయం ముందే తెలిస్తే తాము అసలు కాంగ్రెస్‌తో కలిసే వాళ్లమే కాదని ఆయన చెప్పారు. అంటే.. ఇకపై కాంగ్రెస్‌తో కలిసి పని చేసే అంశంపై ఆలోచిస్తామని వెల్లడించారు. అయితే, ఇది ఈ రాష్ట్రానికే పరిమితమా.. లేక మొత్తంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. నిజానికి ఇండియా కూటమి ఇప్పుడు కీలకంగా వ్యవహరించాల్సి ఉంది.
ఎందుకంటే ఐదు రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని పార్టీలు కలిసి పని చేయడం, పరస్పరం సహకరించుకోవడం అవసరం. కానీ, అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏ పార్టీకాపార్టీ సొంతంగానే పని చేస్తోంది. ఇలాగైతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా కలిసి పని చేస్తారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మధ్య ప్రదేశ్ పరిణామాల నేపథ్యంలో ఎస్పీ.. ఇండియా కూటమిలో కొనసాగుతుందా.. లేదా.. ఇంకా తెలీదు. మరిన్ని పార్టీలు కూడా ఇదే బాటలో వెళ్తే.. ప్రతిపక్ష కూటమికి విచ్ఛిన్నం అవ్వడం ఖాయం.