ALLA RAMAKRISHNA REDDY: బౌన్స్ బ్యాక్.. ఆర్కే వెనక్కి ఎందుకు వచ్చాడో తెలుసా..?

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. తనకు కోపం వచ్చినప్పుడు ఎంత వేగంగా.. దూరంగా జరిగిపోతారో, తగ్గిన వెంటనే అంతే వేగంగా దగ్గరికొస్తానని చెప్పేశారు. తాను సొంత గూటికి చేరినట్టు సింబాలిక్‌గా సీఎం జగన్ ఫోటోను తన వాట్సాప్‌ డీపీగా మార్చేశారాయన.

  • Written By:
  • Updated On - February 21, 2024 / 01:17 PM IST

ALLA RAMAKRISHNA REDDY: సింగడు అద్దంకి పోనూ పోయాడు. రానూ.. వచ్చాడన్నది సామెత. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్‌ ఆర్కే  మళ్ళీ  వైసీపీకి వచ్చేశారు. షర్మిల వెనకే నేను, ఆమెతోనే రాజకీయ అడుగులు అంటూ.. భారీ డైలాగులు చెప్పి వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్‌ చేసిన ఆర్కే .. ఇప్పుడు తిరిగి ఫ్యాన్‌ పార్టీ కి వచ్చేశారు. వైసీపీ అధిష్టానం మీద కోపంతో జంప్‌ చేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న లీడర్‌… కనీసం ఆ కండువాకు నాలుగు ఉతుకులు కూడా పడక ముందే గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేశారు. RK అసలు ఎందుకు వెనక్కి వచ్చాడో తెలుసా.?

Virat Kohli: మరోసారి తండ్రైన కోహ్లీ.. కొడుకు పేరేంటో తెలుసా..
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. తనకు కోపం వచ్చినప్పుడు ఎంత వేగంగా.. దూరంగా జరిగిపోతారో, తగ్గిన వెంటనే అంతే వేగంగా దగ్గరికొస్తానని చెప్పేశారు. తాను సొంత గూటికి చేరినట్టు సింబాలిక్‌గా సీఎం జగన్ ఫోటోను తన వాట్సాప్‌ డీపీగా మార్చేశారాయన. తర్వాత నేరుగా సీఎం జగన్‌ను కలిశారు. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచారు ఆర్కే. అయితే 2019 విజయాన్ని సంచలనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ ముఖ్యనేత లోకేష్‌ను ఓడించడంతో అప్పట్లో ఆర్కే పేరు మోగిపోయింది. అలాంటి వ్యక్తి సడన్‌గా వైసీపీకి దూరమవుతూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారాయన. కానీ… ఆ ఛాన్స్‌ దక్కపోవడంతో క్రమంగా అధిష్టానంతో గ్యాప్‌ పెరిగిందట. ఇక ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల బిల్లులు రావడం లేదని అసహనం పెరిగిపోయింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించి తర్వాత మర్చిపోయారని కూడా అప్పట్లో ఆక్షేపించారు ఆర్కే.

YS JAGAN: వాట్ ఏ ప్లాన్.. ఒక్క మాట అనకుండా చెల్లికి చెక్‌ పెట్టిన జగన్‌..

ఆ తర్వాత సడన్‌గా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన కుటుంబానికి తనకు అత్యంత ఇష్టమైన రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటానని, ఆయన బిడ్డ షర్మిలతో రాజకీయ ప్రయాణం చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమోగానీ.. నెల రోజులు తిరక్కుండానే గోడకు కొట్టిన బంతిలాగా సొంత గూటికి రీ ఎంట్రీ ఇచ్చేశారు మంగళగిరి ఎమ్మెల్యే. దీంతో అసలాయన ఎందుకు పార్టీ మారారు? మళ్ళీ వెంటనే ఎందుకు వెనక్కి వచ్చేశారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఆర్కే ఆరోపించినట్టుగా పెండింగ్ బిల్లుల్ని క్లియర్‌ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారా? లేక పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆఫర్ చేశారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన వర్గం వెర్షన్‌ మాత్రం వేరుగా ఉంది. నియోజకవర్గంలో ఆయన్ని వ్యతిరేకించే నాయకులందర్నీ అధిష్టానం కట్టడి చేసిందని, ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్‌ని ఓడించేందుకు కావాల్సిన అస్త్ర శస్త్రాలన్నిటిని సిద్ధం చేసుకునే క్రమంలోనే ఆయనకు పిలుపు వచ్చిందని చెబుతున్నారు సన్నిహితులు. ఈ టైంలో తాను వైసీపీలో చేరితే బాగుంటుందన్న సన్నిహితులు, బంధువుల సూచనలు మేరకే ఆయన మనసు మార్చుకున్నారట. దీనికి తోడు ఆర్కే సోదరుడు, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఆయన బావ మరిది, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లాంటి నాయకులు వైసిపీలోనే ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో తాను ఒంటరిగా బయటకు వచ్చి, అందులోను, కాంగ్రెస్ లాంటి పార్టీలో సాధించేది ఏమీ లేదని, బలమైన పార్టీలో ఉండటమే కరెక్ట్‌ అని గ్రహించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంగళగిరి సీటు బీసీలకు కన్ఫామ్ చేసినందున ఆ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ఎమ్మెల్యే ఆర్కే పని చేస్తారని ఒక వర్గం చెబుతుంటే.. మరొక వర్గం మాత్రం.. గుంటూరు లేదా పల్నాడు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని అంటోంది. ఆయన్ని తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ అయోధ్య రామిరెడ్డే సీటు కూడా ఇప్పిస్తారన్నది మరో ప్రచారం. మొత్తంగా అసలు పార్టీ వదిలి ఎందుకు వెళ్లారో తిరిగి ఎందుకు వచ్చారో అన్నట్లు ఉంది ఆర్కే వ్యవహారం. మరి అనుకున్నట్లుగా ఎమ్మెల్యే మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతలు మాత్రమే తీసుకుంటారా? లేక ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అన్న పాయింట్‌ చుట్టూ ప్రస్తుతం కొత్త చర్చ మొదలైంది.