నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే అఖిలప్రియ అనుచరులు సుబ్బారెడ్డి మీద ఎటాక్ చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. తండ్రికి ప్రాణస్నేహితుడిగా ఉన్న వ్యక్తి మీద అఖిలప్రియ ఎందుకు దాడి చేసిందో చూస్తే.. ఓ ఫ్యాక్షన్ సినిమాను తలపించేంత స్టోరీ ఉంది ఈ రెండు కుటుంబాల మధ్య. కర్నూలు జిల్లాలో చాలా ఏళ్ల పాటు సుబ్బారెడ్డి నాగిరెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నాడు. అతని ప్రతీ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. కాని నాగిరెడ్డి హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన తరువాత సుబ్బారెడ్డికి నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియకు విభేదాలు వచ్చాయి. అప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియ సుబ్బారెడ్డిని దూరం పెట్టేసింది. రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగింది. ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య వార్ మొదలైంది. ఈ గొడవలు చంపుకునేదాకా వెళ్లాయి. అప్పట్లో అఖిలప్రియ నన్ను చంపేందుకు ప్రయత్నిస్తోంది అంటూ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ గ్యాంగ్‌కు సుపారీ కూడా అఖిలప్రియ ఇచ్చిందంటూ కంప్లైంట్ ఇచ్చాడు.
2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అఖిలప్రియ ఓడిపోయింది. దీంతోపాటు జూబ్లీహిల్స్‌లోని ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో సీఎం కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేయించేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయ్యింది. ఆళ్లగడ్డలో కూడా చాలా మందికి అఖిలప్రియ బాకీ పడింది. తమ డబ్బు తమకు ఇచ్చేయాలంటూ అఖిలప్రియ ఇంటిముందు బాధితులు ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే టెంట్ వేసుకుని రిలే నిరాహారదీక్షలు కూడా చేశారు. అఖిలప్రియ మీద ఉన్న ఆరోపణల దృష్ట్యా ఆమెకు టికెట్ ఇవ్వొద్దని సుబ్బారెడ్డి చంద్రబాబును కోరారట. ఆళ్లగడ్డ టికెట్ తనకు.. నంద్యాల టికెట్ తన కూతురు జస్వంతి రెడ్డికి ఇవ్వాలంటూ చంద్రబాబును కోరారట. సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ కొడుకును పెళ్లి చేసుకుంది. బొండా ఉమ చాలా బలమైన కాపు నేత. దీంతో ఆళ్లగడ్డ, నంద్యాలలో ఉన్న 30వేలకు పైగా కాపు ఓట్లు టీడీపీకే పడతాయంటూ చెప్పారట సుబ్బారెడ్డి.
అఖిలప్రియ అప్పులుపాలైపోయిందని.. ఇప్పుడు టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితిలో లేదని చెప్పారట. లోకేష్ పాదయాత్ర నంద్యాలలోకి ప్రవేశించిన సందర్భంగా లోకేష్‌కు స్వాగతం పలికి ఇదే విషయం మాట్లాడేందుకు వెళ్లారట సుబ్బారెడ్డి. తనను పక్కకు పెట్టి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేయడంతో అఖిలప్రియ రగిలిపోయింది. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే అఖిలప్రియ, సుబ్బారెడ్డి అనుచరులకు మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఒక్కసారిగా అఖిలప్రయ అనుచరులు నేరుగా సుబ్బారెడ్డి మీద ఎటాక్ చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సుబ్బారెడ్డిని సేఫ్‌గా అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఈ గొడవ జరిగినప్పుడు అఖిలప్రియ కూడా స్పాట్‌లోనే ఉంది. దీంతో ఆమె కావాలని అనుచరులను తనపైకి ఉసిగొల్పిందని సుబ్బారెడ్డి పోలీస్ కంప్లైట్ ఇచ్చారు. దీంతో అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు పాణ్యం స్టేషన్‌లో ఆమెను విచారించారు. ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీ టీడీపీ వర్గాల్లో సెగలు రేపుతోంది.