పుష్ప హీరోకి వైసీపీ ఎందుకంత ఎలివేషన్ ఇస్తోంది ? అల్లు అర్జున్ ను వైసీపీ ఓన్ చేసుకుంటోందా ? అరెస్టు విషయంలో వైసీపీ నేతలు అతిగా స్పందించారా ? ఒకరేమో ఖండిస్తారు. ఇంకొక్కరేమో పవన్ పాత్ర ఉందంటారు. మరొకరు అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారని అంటారు ? పుష్పకు నిజంగానే అంతసీన్ ఉందా ?
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో పుష్ప హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సంధ్య థియేటర్ ఘటనలో బన్నీ మాత్రమే బాధ్యుడ్ని చేయడంపై…వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మార్గాని భరత్, లక్ష్మిపార్వతి వంటి నేతలు…పుష్ప అరెస్టును ఖండించారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో వైసీపీ నేతలు ఓవర్ గా స్పందించడంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. శత్రువుకి శత్రువు…మనకు మిత్రుడు అన్న యాంగిల్ లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న టాక్స్ నడుస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే జగన్ తో పాటు వైసీపీ నేతలకు అసలు పడదు. ఆ పార్టీ నేతలు సందర్భం వచ్చినపుడల్లా పవన్ కల్యాణ్ ను తిట్టిపోస్తుంటారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆ పార్టీ మొత్తంగా 21 సీట్లలో బరిలోకి దిగింది. సొంత మామ అయిన పవన్ కల్యాణ్, ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించలేదు. సరికదా కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు. అదే సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. కుటుంబసమేతంగా స్వయంగా నంద్యాలకు వెళ్లారు. వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ర్యాలీ చేశారు. అప్పట్నుంచి మెగాస్టార్, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి భారీ విజయం సాధించింది. పవన్ అభిమానులు…బన్నీని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆ తర్వాత వైసీపీ నేతలు అల్లు అర్జున్ ను ఓన్ చేసుకుంటున్నారు. వైసీపీ నేతల అండతోనో, లేదంటే పుష్ప ఇచ్చిన విజయంతోనూ…అల్లు అర్జున్ బిహేవియర్ లో బాగా మార్పు వచ్చింది. పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ ఈవెంట్లలో తనకంటే గొప్ప నటులు ఎవరు లేరనేలా స్పీచ్ ఇచ్చాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పలేదని.. అందుకే కక్షగట్టి అరెస్టు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు సినిమాలో ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ ! ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్… పావలా పెర్సెంట్ వాటా గాడివి ఏంటి రా నీ మాట వినేది అన్న డైలాగ్ లు వైసీపీ నేతలకు బాగా నచ్చేశాయి. అదే సమయంలో మోగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించాయి. ఆ తర్వాత నాగబాబు కూడా తప్పుదారిలో వెళ్తున్నావంటూ పరోక్షంగా బన్నీని ఉద్దేశించి ట్వీట్లు చేశాడు.
ఇలా వరుసగా జరిగిన పరిణామాలు…అల్లు అర్జున్ ను వైసీపీకి దగ్గరి చేశాయని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సపోర్ట్ పోస్టింగ్ పెట్టింది. నువ్ మా కోసం నిలబడ్డావ్.. మేము నీ కోసం నిలబడతాం’ అంటూ వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నుంచి లక్ష్మీపార్వతి దాకా వరుసగా ఖండించారు. ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం ? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బన్నీ అరెస్టు వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్ హస్తం ఉందంటూ లక్ష్మీపార్వతి ఆరోపించారు. పుష్కరాలు ఘటనలో, కందుకూరు ఘటనలో చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలని ప్రశ్నించారు. అటు పుష్ప అరెస్టును తప్పుబడుతూ మాజీ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. బహిరంగసభలు జరిగినపుడు అనుకోని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోతే…ఎంత మంది రాజకీయ నేతలను అరెస్టు చేశారని మార్గాని ప్రశ్నించారు. హైకోర్టులో వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దీంతో ఈ ఇష్యూను వైసీపీ ఓన్ చేసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో…పుష్ప అంటే ఫైర్ కాదని…ఫ్లవరేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టు.. అటు రాజకీయాలు. ఇటు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయంపై చర్చ జరుగుతోంది. ఒకేరోజులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం కామన్. కానీ అదే రోజు బెయిల్ రావడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.