Ambati: అంబటి చీటి చిరిగిపోతోందా..?

సత్తెనపల్లిలో మంత్రి అంబటి చీటి చిరిగిపోబోతోందా..? సమీకరణాలు ఆయనకు ఎదురుకొడుతున్నాయా...? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. నేను సత్తెనపల్లిని వదలనని మంత్రి అంటున్నా... సీటు ఇవ్వాల్సిన సీఎం జగన్ ఆలోచన మాత్రం వేరేగా ఉందన్నది తాడేపల్లి టాక్.

  • Written By:
  • Updated On - March 10, 2023 / 03:06 PM IST

నోరు తెరిస్తే టీడీపీపై విరుచుకుపడే అంబటికి ఈసారి అన్ని సమీకరణాలు ఎదురు తిరుగుతున్నాయి. ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలు అంబటి సీటుపై అనుమానాలు రేపుతున్నాయి. సత్తెనపల్లి కాదు ఓవరాల్ గా ఎమ్మెల్యే సీటే డౌటులో పడింది. సత్తెనపల్లిలో సర్వేలు అంబటికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీనికి తోడు అమరావతి ఎఫెక్ట్ మంత్రిపై పడింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి సీటు మారాలని చూస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం తర్వాత మంగళగిరిలో పరిస్థితులు మారిపోయాయి. అంతకుముందు వరకు జనంలో ఉన్న ఎమ్మెల్యే బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఈసారి టీడీపీ నేత లోకేషును డీకొట్టడం అంత ఈజీ కాదు. దీంతో ఆయన్ను సత్తెనపల్లి పంపాలని వైసీపీ హైకమాండ్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

మరి అక్కడున్న అంబటిని ఏం చేస్తారన్నది పెద్ద ప్రశ్న. నిజానికి సత్తెనపల్లి ఆయన నియోజకవర్గం కాదు.. ఆయనది రేపల్లె నియోజకవర్గం. 1989లో ఎమ్మెల్యేగా అక్కడి నుంచే గెలిచారు. ఆ తర్వాత టీడీపీ చేతిలో రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ఇంతకాలానికి జగన్ సునామీలో సత్తెనపల్లి నుంచి పాసయ్యారు. సీనియర్ నేత కోడెలపై గెలిచి అసెంబ్లీలో రెండోసారి అడుగుపెట్టారు. కానీ ఆ నియోజకవర్గం కూడా సింగిల్ టర్మ్ కే పరిమితమయ్యేలా ఉంది. ప్రాణం పోయినా సత్తెనపల్లిని వదలనని అంబటి పదేపదే చెబుతున్నారంటేనే ఆయనలో అనుమానాలు మొదలయ్యాయని అర్థం. పోనీ వేరే నియోజకవర్గానికి పంపాలన్నా ఎక్కడికి పంపాలన్నదే పెద్ద ప్రశ్న. రేపల్లెలో పరిస్థితి అనుకూలంగా లేదు. గతంలో ఇక్కడ మోపిదేవి వెంకటరమణ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన్ను ఎంపీగా పంపారు. మరోసారి అక్కడ్నుంచి ఆయన పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
అంబటిని అవనిగడ్డకు పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ సర్వేల్లో అంబటి కంటే అక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యేకే ఎక్కువ మార్కులు వచ్చాయి. మరే నియోజకవర్గమూ కనిపించడం లేదు. పైగా ఎన్నికలకు ఏడాది కూడా లేదు. ఎటు మార్చినా ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న నేతల నుంచి వ్యతిరేకత రావచ్చు.

అంబటిని తన వ్యవహారశైలి కూడా కొంతమేర దెబ్బకొట్టినట్లే కనిపిస్తోంది. గంట అరగంట అంటూ ఆడియో టేపులు వైరల్ అయ్యాయి. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి కూడా లంచం అడిగారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. లాటరీ వ్యవహారం కూడా బెడిసికొట్టింది. నియోజకవర్గంలో మంత్రి, ఆయన అనుచరులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గడప గడపకు కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగనప్పుడు మంత్రికి సెగ కాస్త గట్టిగానే తగిలింది. దీంతో సత్తెనపల్లిలో మళ్లీ అంబటి పోటీ చేస్తే సీటు చేజారిపోతుందని వైసీపీ హైకమాండ్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఆళ్లను అక్కడకు పంపితే అన్నీ కలిసి వస్తాయని భావిస్తోంది.

టీడీపీ నుంచి ఈసారి సత్తెనపల్లిలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిని రేపుతోంది. కోడెల శివరాం సీటు తనకే అని చెప్పుకుంటున్నా పార్టీ హైకమాండ్ మాత్రం కుదరదని తేల్చిచెప్పినట్లు సమాచారం. బీజేపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా ఆయన్ను గుంటూరులో నిలబెడతారని మరో ప్రచారం జరుగుతోంది. రాయపాటి వర్గానికి చెందిన ఓ నేత కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఒకవేళ జనసేనతో పొత్తు కుదిరితే మాత్రం సత్తెనపల్లిని ఆ పార్టీకి కేటాయించొచ్చన్న లెక్కలూ ఉన్నాయి.

ఈసారి ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని అంచనా. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి జీవన్మరణ సమస్య. పార్టీ నిలబడాలంటే గట్టిగా పోరాడాలి. అందుకే ఈ వయసులోనూ చంద్రబాబు స్ట్రెస్ తీసుకుంటున్నారు. మరోవైపు వైసీపీకి కూడా ఈ ఎన్నికలు కీలకం. రివెంజ్ పాలిటిక్స్ కాలంలో తేడా వస్తే తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వైసీపీకీ తెలుసు.. అందుకే ఈసారి ప్రతి ఓటూ కీలకమే.. ప్రతి సీటూ కీలకమే.. అందుకే సీనియర్ నేత అయినా మంత్రి అయినా గెలవరనుకుంటే పక్కన పెట్టేయాలని జగన్ భావిస్తున్నారు. కొంతమంది తాజా, మాజీ మంత్రులకు సీట్లు కష్టమేనంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అంబటి పేరు చేరింది. మరి మొదట్నుంచి తనతో నడిచిన అంబటిని జగన్ పక్కన పెడతారా..? లేక మరో నియోజకవర్గానికి మారుస్తారా..? లేదంటే ఏ ఎమ్మెల్సీ పదవో ఆశచూపి సైలెంట్ చేస్తారా..?

(KK)