Ambati Rayudu: వాలంటీర్లపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా వైరల్ గా మారాయి.
అయితే తాజాగా వాలంటీర్ల విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ వాలంటీర్లకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసాడు. టీమిండియా మాజీ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవలే తన క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రాయుడు రాజాకీయాల మీద ఆసక్తి ఉండటం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆ తర్వాత అర్ధమైంది. తాను కూడా చిన్నప్పటి నుండి సివిల్ సర్వీస్ చేసి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా అని తెలియజేశాడు. అంబటికి రాజకీయాలపై ఆసక్తి ఉందని తెలిసి ఏపీలో పలు పార్టీలు ఆయనకు ఆహ్వానాలు పలికినట్లు సమాచారం. 2024 లో ఎలక్షన్స్ ఉండడంతో రాయుడు ఇక క్రికెట్‌ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి చేరబోతున్నాడనే సంకేతం ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్ధం అవుతుంది.
ఈ మేరకు జగన్ నుంచి ఏదైనా హామీ అందడం వల్లనే ఇలా ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు అనే కామెంట్లు కూడా అప్పట్లో వినిపించాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్న రాయుడు వాలంటీర్ల విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఈ సందర్భంగా “ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. వీటి వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మనం మంచి పనులు చేస్తున్నప్పుడూ ఎవరో ఒకరు బురద చల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్లాలి” అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కరోనా టైములో వాలంటీర్లు చేసిన సేవను మర్చిపోవద్దని తెలియజేశాడు. ప్రాణాలను లెక్క చేయకుండా వారు చేసిన సేవ మరువ లేనిదని కామెంట్స్ చేసాడు. మొత్తానికి రాజకీయాల్లోకి రావడానికి మరింత అగ్రెసివ్ గా రాయుడు ముందుకెళ్తున్నాడని చెప్పకనే చెప్పాడు.