AMBATI RAYUDU: గుంటూరు కారం ఘాటు ఇంకా యమ హాట్‌గా మారబోతోందా..? పొలిటికల్ ఫ్రెష్ నీరొచ్చి పాత నీటిని నెట్టేస్తోందా..? గడిచిన ఆరు నెలలుగా గుళ్ళు, బళ్ళు, ఊళ్ళు పట్టుకుని రాష్ట్రమంతటా తెగ తిరిగేస్తున్న అంబటి రాయుడు.. ఇప్పుడు పైనల్‌గా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇన్నాళ్ళూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పిన మాజీ క్రికెటర్.. ఇప్పుడ ఫ్రష్‌గా పొలిటికల్ క్లారిటీ ఇచ్చేసరికి కొందరు పాత నేతలకు ఫిలిమెంట్స్ రాలిపోతున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో. మాజీ క్రికెటర్‌గా యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న అంబటి రాయుడు ఫ్యాన్ కిందికి చేరిపోయారు. ఇన్నాళ్లు తాను ఏ పార్టీలో చేరతానో తెలియదనీ.. అందరికీ చెప్పే చేరతానని అన్న రాయుడు సడన్‌గా, సైలెంట్‌గా వైసీపీలో చేరిపోయారు. దీంతో అలా.. అంత నిరాడంబరంగా, చడీ చప్పుడు లేకుండా ఎందుకు జరిగిందని ఆరా తీస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.
AP Elections : టీడీపీ ఆఫీసులో వైసీపీ కోవర్టులు.. ఎవడు మనోడు ? ఎవడు బయటోడు ?
అందుకు ఆయన సన్నిహితుల సమాధానం మాత్రం వేరేగా ఉంది. నాలుగు రోజులుగా అంబటి రాయుడు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారనీ, అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతున్న వేళ.. వైసీపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారని అంటున్నారు. అదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రాయుడి ప్రధాన టార్గెట్ ఏంటి? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన గ్రామాలు రెండూ.. గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. బంధుగణం కూడా ఇక్కడే ఉంది. అందుకే నేను లోకల్ అంటూ.. గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట ఆయన. కాదంటే ఆ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ని ఎంచుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలోనే.. 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటన్న డౌట్ వస్తోందట కేడర్‌కు. ఇప్పటికే మోదుగుల వియ్యంకుడు అయోధ్య రామిరెడ్డి కుటుంబం నుంచి ఆయన సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టిక్కెట్ లేదని చెప్పేసింది వైసీపీ.
ఆయన రేపో మాపో ప్రత్యామ్నాయం చూసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. మోదుగుల సైతం కొన్నాళ్ల నుంచి కామ్‌గా ఉన్నారు. ఆ నిశ్శబ్దమే ఇప్పుడు సీటు పోగొట్టుకొవడానికి కారణమా అన్న చర్చ జరుగుతోంది కేడర్‌లో. అదే సమయంలో పల్నాడు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనకు అవకాశం ఇవ్వవచ్చన్న మరో వాదనా వినిపిస్తోంది. అవసరాన్ని బట్టి నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేయాల్సి ఉంటుందన్న సంకేతాలను అధిష్టానం మోదుగులకు పంపినట్టు తెలిసింది. అయితే రాజకీయంగా మోదుగుల ప్రస్తుతం అంత ఆసక్తి లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే.. ఓ పక్కన పెద్ద బావ,మరో పక్కన చిన్న బావ, ఎవరు చెప్పింది చేయాలో! ఎవరి దారిలో నడవాలో? అర్థం కాని స్థితిలో ఉన్నారట ఆయన. ఒకరి మాట విని మరొకరికి దూరం అయ్యే బదులు అసలు రాజకీయాలకే దూరమైతే పోలా.. అన్న నైరాశ్యంలో ఉన్నారని చెప్పుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలోనే రాయుడికి గుంటూరు లోక్‌సభ ఫిక్సయినట్టేనా లేక మరో ఆలోచన ఉందా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఆరు నెలలుగా ప్రజల మధ్య తిరుగుతున్న రాయుడు.. సమస్యలు తెలుసుకున్నాననీ, పొలిటికల్ ఇన్నింగ్స్‌ని కూడా.. లైన్ అండ్ లెంగ్త్ చూసి పర్‌ఫెక్ట్‌గా ఆడతానని సన్నిహితులకు చెబుతున్నారట.
ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అంతో ఇంతో మేలు చేయాలని అనుకుంటున్నారట ఆయన. ఆ స్టేట్‌మెంట్స్‌ని బట్టి చూస్తుంటే… రాయుడిని గుంటూరు బరిలో దింపుతారా..? లేక మరో రకంగా ఉపయోగించుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. గుంటూరు లేదా మచిలీపట్నం లోక్‌సభ సీటుకే పరిశీలించవచ్చన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లో ఏదో ఒక స్థానానికి ఫిక్స్ చేస్తారా లేక ఆయనకున్న ఇమేజ్‌ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వాడుకుంటారా అన్నది చూడాలి.