ఎన్నికల వ్యూహాలను రచించడంలో బీజేపీ మిగతా పార్టీలకంటే భిన్నంగా ముందుకెళ్తుంది. ఎలక్షన్ ఇంజినీరింగ్‌లో ఆ పార్టీ వ్యూహాలు ప్రత్యర్థులకు అంతుపట్టవు. ఓటు బ్యాంకు ఉన్నా లేకపోయినా…. ఎత్తులు పైఎత్తులు వేసైనా సరా.. కుంభస్థలాన్ని కొట్టాలన్నది ఆ పార్టీ విధానం. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాషాయ దళం ఇలాంటి స్ట్రాటజీతోనే ముందుకెళుతుంది. రాష్ట్రంలో బీజేపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు అమిత్ షా భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసినా..ఇప్పటి వరకు అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎన్నికల సభల కోసం షా తెలంగాణలో అడుగుపెట్టకపోయినా… రిమోట్ కంట్రోల్ ద్వారా మొత్తం ఢిల్లీ నుంచే ఎన్నికల కథ నడిపిస్తున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది.
తెలంగాణ కోసం స్పెషల్ వార్ రూమ్
రానున్న తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేలా అమిత్ షా ఎన్నికల స్ట్రాటజీని సిద్ధం చేశారు. దీని కోసం ఢిల్లీలో ప్రత్యేకమైన వార్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 800 మంది సిబ్బంది తెలంగాణ కోసమే ఢిల్లీ నుంచి పనిచేయబోతున్నారు. ఎలక్షన్ ఇంజినీరింగ్ పై పూర్తి అవగాహన ఉన్న యువతీ యువకులు, మేథావులు ఈటీమ్ లో ఉండబోతున్నారు. ఈ 800మందికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. వీళ్లలో ఒక్కరికి కూడా పార్టీ వ్యవహారాలతో సంబంధముండదు. వీళ్లంతా కూడా బీజేపీతో గానీ, ఆర్ఎస్ఎస్‌తో గానీ సంబంధం లేనివాళ్లే. పూర్తిగా ఎన్నికల లెక్కల పైనే ఈ టీమ్ పనిచేస్తుంది. ఏ నియోజకవర్గంలో గెలవడానికి ఎలాంటి వ్యూహం అమలు చేయాలి. ఇదే వీళ్ల పని.
ఢిల్లీలో అమిత్ షా..తెలంగాణలో జవదేకర్
తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఢిల్లీ వరకు.. వయా హైదరాబాద్ మొత్తం మూడంచెల ఎన్నికల వ్యవస్థ ద్వారా ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌కు ప్లాన్ చేశారు అమిత్ షా. తెలంగాణ ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం అమిత్ షా స్పెషల్ టీమ్ వర్క్ చేసింది. వీళ్లతో పాటు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల వ్యూహాలను, స్టేట్ సెంటర్ టీమ్ లను కో ఆర్డినేట్ చేసే బాధ్యతను సీనియర్ నేత ప్రకాశ్ జగదేకర్‌కు అగ్రనాయకత్వం అప్పగించింది. ఢిల్లీ తెలంగాణ వార్ రూమ్ కోసం పనిచేయబోతున్న సిబ్బందిలో 75 మంది నేరుగా అమిత్ షాకు రిపోర్టు చేయబోతున్నారు. మిగతా వాళ్లు నియోజకవర్గాలపై డైరెక్ట గా ఫోకస్ పెడతారు. అవసరమైతే నియోజకవర్గాల్లోనే తిష్ట వేస్తారు.
గెలుపు గుర్రాలపై స్పెషల్ ఫోకస్
ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు అమిత్ షా. ప్రస్తుతం తెలంగాణ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించడంపైనా చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ చీఫ్ బండి సంజయ్, అరవింద్, సోయం బాపురావ్‌లు అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలొస్తున్నయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను డిసైడ్ చేయబోతంది బీజేపీ అగ్రనాయకత్వం. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో అమిత్ షా నేతృత్వంలోని ఢిల్లీ వార్ రూమ్ కీలకంగా వ్యవహరించబోతోంది.