T BJP: తెలంగాణలో పట్టుకోసం బీజేపీ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భారీ సభలు, ర్యాలీలు ప్లాన్ చేసింది. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అయితే, నేతల మధ్య విబేధాలు, పరస్పర ఆరోపణలతో బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ పరిణామాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.
తెలంగాణలో బండి సంజయ్ వర్సెస్ ఈటల, ఇతర నేతలు అన్నట్లుగా బీజేపీ పరిస్థితి తయారైంది. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బండికి వ్యతిరేకంగా ఈటల, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటి నేతలు పావులు కదుపుతున్నారు. అలాగే ఇటీవల కోవర్టుల అంశం కూడా తెరమీదకు వచ్చింది. తెలంగాణ బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ ఆ పార్టీ నేతలే విమర్శలు చేశారు. దీనికితోడు అధ్యక్షుడి మార్పు అంటూ మరో ప్రచారం తెరమీదకొచ్చింది. బండి సంజయ్‌ను మారుస్తారంటూ ప్రచారం జరిగింది. నేతల మధ్య విబేధాలతో పార్టీలో గందరగోళ పరిస్థితి తలెత్తింది.
అమిత్ షా సభతో క్లారిటీ వచ్చేనా..?
తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో ఉందన్నది వాస్తవం. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తోంది. అందుకే భారీ సభలు, ర్యాలీలు వంటి కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. వరుసగా కేంద్ర మంత్రులు, జాతీయస్థాయి నేతలు రాష్ట్రానికి రానున్నారు. అయితే, అమిత్ షా పర్యటనతో నేతల మధ్య విబేధాలు తొలగిపోతాయని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లోనే .. అంటే గురువారం ఈ సభ జరగనుంది. ఈ లోపు నేతలంతా ఒక్కతాటిపైకి వస్తేనే సభ సక్సెస్ అవుతుంది. అందులోనూ ఖమ్మంలో పార్టీకి బలం తక్కువ. అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులదే హవా. అలాంటి చోట సభ సక్సెస్ కావాలంటే అందరూ కలిసి పనిచేయాలి. ఈ సభకు హాజరయ్యే నేతలు, సక్సెస్ అయ్యే విధానాన్ని బట్టి బీజేపీ నేతల మధ్య విబేధాలపై ఒక అంచనాకు రావొచ్చు.
సమస్య ఎక్కడ..?
బండి సంజయ్ అందరినీ కలుపుకొని పోవడం లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఒకవర్గాన్ని ఆయన ప్రోత్సహిస్తూ, మరోవర్గాన్ని దూరం పెడుతున్నారన్న వాదన ఆయనపై ఉంది. బండికి మద్దతుగా ఒక వర్గం.. ఆయనకు వ్యతిరేకంగా మరో వర్గం పనిచేస్తున్నాయి. వ్యతిరేక వర్గంలో ఈటల కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆయన తనకు పార్టీలో ప్రాధాన్యం కావాలని ఆశిస్తున్నారు. అయితే, కొత్తగా వచ్చిన ఈటల, ఇతర నేతలకు అప్పుడే కీలక పదవులు ఇవ్వడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈటల బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీకి వచ్చిన నేత కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బీజేపీలో చేరారు. ఆయనతోపాటు కొండా, డీకే అరుణ సహా ఇతర నేతలు ఇలా వలస వచ్చిన వాళ్లే. వాళ్లు తమకు ప్రాధాన్యం కావాలని ఆశిస్తుంటే.. ఎప్పటినుంచో బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీ కోసం పని చేస్తున్న వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి.
క్రమశిక్షణ ఏది..?
బీజేపీలో అతిగా స్వేచ్ఛ ఉండదు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాల్సిందే. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను హైకమాండ్ ప్రోత్సహించదు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఉన్న గందరగోళాన్ని హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. అందులోనూ అమిత్ షా, జేపీ నద్దా తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. క్రమశిక్షణ తప్పి, పార్టీకి చేటు చేస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలనుంది.