Chandrababu Naidu: చంద్రబాబుపై ముడుపుల ఆరోపణలు.. రంగంలోకి దిగిన ఏపీ సీఐడీ

ఐటీ స్కాంలో కీలక వ్యక్తి మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని, స్కిల్‌స్కాంలో నిందితుడు యోగేష్‌ గుప్తాలకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ ఏపీ సీఐడీ విచారించబోతుంది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి, కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ వారిపై ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 03:36 PM IST

Chandrababu Naidu: చంద్రబాబుపై అభియోగాలున్న ఐటీ స్కాంలో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్‌ స్కాంల్లో మూలాలు ఒకేచోట ఉన్నాయనే అంశంపై ఏపీ సీఐడీ దృష్టి సారించింది. నిందితులు రెండు స్కాంలలోనూ ఉండటంతో వారిని విచారించేందుకు సిద్ధమవుతోంది. ఐటీ స్కాంలో కీలక వ్యక్తి మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని, స్కిల్‌స్కాంలో నిందితుడు యోగేష్‌ గుప్తాలకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ ఏపీ సీఐడీ విచారించబోతుంది.

టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి, కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ వారిపై ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి. నాలుగేళ్లుగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయపు పన్నుశాఖ విచారణ జరుపుతోంది. మరోవైపు స్కిల్‌ స్కాంలో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు స్కాంల్లో కూడా డబ్బు అందుకున్నట్టుగా చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై అభియోగాలు నమోదయ్యాయి. రెండు స్కాంల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అంటున్న దర్యాప్తు సంస్థలు. దీంతో ఈ స్కాంల్లో ఉన్నవారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించి, విచారణ జరపనుంది. నిందితుల నుంచి దుబాయ్‌లో చంద్రబాబు డబ్బు అందుకున్నట్టు సీఐడీ ఆరోపిస్తోంది. దీనిపై కూడా దృష్టి పెట్టనున్న సీఐడీ వివరాలు సేకరిస్తోంది. త్వరలో దుబాయ్‌కు విచారణ బృందం వెళ్లనుంది. అక్కడి వివరాలు సేకరించి, తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

తగిన ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును కూడా సీఐడీ విచారించడంతోపాటు, అరెస్టు కూడా చేసే వీలుంది. తనను రెండు రోజుల్లో అరెస్టు చేస్తారని చంద్రబాబు బుధవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. చంద్రబాబు వ్యవహారం దొంగతనం చేసి దబాయించినట్లుగా ఉందని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తేల్చింది వైసీపీ కాదని, ఐటీ శాఖ అని పేర్కొన్నారు. దీనికి చంద్రబాబు సరైన సమాధానం చెప్పకుండా, తనను అరెస్టు చేస్తారని అనవసర రాద్దాంతం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబుకు అరెస్టు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు.