INDIA: ఇండియాకు మరో ఝలక్.. బిహార్‌లో పోటీ చేస్తామంటున్న ఆప్..!

ప్రతిపక్షాల ఇండియా కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న పార్టీలు బిహార్‌లో అధికారంలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాయి. అలాంటప్పుడు ఇదే కూటమికి చెందిన ఆప్ కూడా తాము బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 07:13 PM IST

INDIA: ఇండియాగా ఏర్పడ్డ ప్రతిపక్ష కూటమిలో పార్టీల మధ్య ఇంకా సరైన అవగాహన లేనట్లే కనిపిస్తోంది. కూటమిగా ఏర్పడ్డ పార్టీలు ఒక పక్క కలిసి పోటీ చేసి, కేంద్రంలో మోదీని ఓడిస్తామని చెబుతూనే.. మరోపక్క విడివిడిగా పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని అన్ని సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై ఆప్ నుంచి వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంది. అయితే, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.
బిహార్‌లో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ప్రతిపక్షాల ఇండియా కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న పార్టీలు బిహార్‌లో అధికారంలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాయి. అలాంటప్పుడు ఇదే కూటమికి చెందిన ఆప్ కూడా తాము బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరుగుతాయి.

ఆ లోపు తమ పార్టీని రాష్ట్రంలో బలపడేలా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ బిహార్ ఇంచార్జి అజేష్ యాదవ్ అన్నారు. చెత్త రాజకీయాల వల్ల బిహార్ వెనుకబడిపోయిందని, అభివృద్ధి చెందడం లేదని, అందుకే మార్పు కోసమే ఆమ్ ఆద్మీ రాష్ట్రంలో పోటీ చేస్తుందని అజేష్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి, పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. కాగా, ఇండియా కూటమిలో భేదాభిప్రాయాలున్నప్పటికీ.. దేశమే తమకు ముఖ్యమన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా.. లేక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా అనే విషయంలో ఇంకా ఆప్ నుంచి స్పష్టత లేదు. దీనిపై ఆర్జేడీ, జేడీయూ స్పందించాయి. ఇండియా కూటమి ఏర్పడ్డప్పుడే ఇలాంటి అంశాలపై ఒక అభిప్రాయానికి వచ్చామని, దీనికి ఆప్ అంగీకరించిందని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది.

అయితే, పార్టీలు విస్తరించడాలనుకోవడంలో తప్పు లేదని, ఏ పార్టీ అయినా ఎదగాలనుకుంటుందని జేడీఎస్ నేతలు అంటున్నారు. ఆప్ నిర్ణయంలో తప్పు లేదని, తాము కూడా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పారు. రాష్ట్రాలకు సంబంధించి ఇండియా కూటమిలో సమస్యలున్నప్పటికీ, వాటిని పరిష్కరించుకుంటామని వెల్లడించారు. ఆప్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ.. బిహార్‌లో ఎవరు పోటీ చేసినా.. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని వ్యాఖ్యానించింది.