AP BJP: ఏపీ బీజేపీ@ అయోమయం, గందరగోళం

నేతలు రావడం, పోవడం పొలిటికల్ పార్టీల్లో మామూలే... కానీ ఏపీ బీజేపీలో మాత్రం ఎగ్జిట్‌లే తప్ప ఎంట్రీలు ఉండటం లేదు. ఇలాగైతే ఎలా అంటూ కరడు గట్టిన కమలం కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 11:16 AM IST

అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది…? ఈ ప్రశ్న మనది కాదు… ఏపీ బీజేపీ కార్యకర్తలదే… అవును ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో కమలం కార్యకర్తలకు అసలు అర్థం కావడం లేదు, అంతుపట్టడం లేదు. పోనీ అంతర్గతంగా ఏమి నడుస్తోందో చెబుదామంటే ఆ పార్టీ నేతలకు కూడా అసలేం తెలియడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్‌తో ఇది మరోసారి తేలిపోయింది. నేతలు రావడం, పోవడం పొలిటికల్ పార్టీల్లో మామూలే… కానీ ఏపీ బీజేపీలో మాత్రం ఎగ్జిట్‌లే తప్ప ఎంట్రీలు ఉండటం లేదు. ఇలాగైతే ఎలా అంటూ కరడు గట్టిన కమలం కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో మా పొత్తు ప్రజలతోనే అన్నది ఏపీ బీజేపీ నినాదం… నిజమే ఏ పార్టీకైనా ప్రజలతోనే పొత్తు ఉండాలి. ప్రజలతో పొత్తుండాలంటే ముందు సరైన నేతలుండాలి కదా…? జనాన్ని తమవైపు తిప్పుకునే చరిష్మా ఉన్నవారు కావాలి కదా…? మరి ఏపీ బీజేపీలో అలా జనాకర్షణ ఉన్న నేతలు ఎంతమంది అంటే వేళ్లతో లెక్కబెట్టాల్సిన పనికూడా లేదు. ఒకరిద్దరు దొరికినా గొప్పే…

పార్టీలో గట్టి నేతలు లేరు సరే ఉన్న నేతలనైనా సరిగా వాడుకున్నారా అంటే అదీ లేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ చీఫ్‌గా పనిచేశారు. గతంలో ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాష్ట్రమంత్రిగా పనిచేశారు. రాజకీయం తెలిసిన నేత… పార్టీ అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత ఆయనకు, సోము వీర్రాజుకు పడలేదు. అది పార్టీలో బహిరంగ రహస్యమే… దాన్ని సద్దుమణచడానికి హైకమాండ్ ఏ మాత్రం ప్రయత్నించలేదు. చివరకు కన్నా తన దారి తాను చూసుకున్నారు.

ఏపీ బీజేపీకి స్తబ్ధత బాగా అలవాటైపోయింది. ఒకరిద్దరికి మినహా మిగిలిన వారికి ప్రజల్లోకి వెళ్లాలన్న తపన ఏ మాత్రం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన, ఆ తర్వాత పరిస్థితుల్లో ఏపీ ప్రజలు బీజేపీకి దూరమయ్యారు. పార్లమెంట్ తలుపులు మూసేసి, సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మరీ బిల్లును ఆమోదించడం వెనక బీజేపీ పాత్రపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వంటి కారణాలు పార్టీని మరింత దూరం చేశాయి. దాన్నుంచి బయటపడి పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కమలనాథులు చేసిన ప్రయత్నాలు పెద్దగా లేవు. అడపాదడపా ప్రెస్‌మీట్లు, ఒకటి రెండుసార్లు రోడ్డెక్కి మేమూ ఉన్నామని చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ఈ ప్రజాసమస్యపై మేం పూర్తిస్థాయిలో పోరాటం చేసామని బీజేపీ నేతలు పార్టీపై ఒట్టేసి చెప్పడానికి ఒక్కటైనా ఉందా…?

రాష్ట్రవిభజన నాటి నుంచి ఇప్పటివరకు కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి అన్ని వేల కోట్లు ఇచ్చాం… ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం అని ప్రకటనలు చేస్తున్నారు. మరి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం వెనకబడి పోతున్నారు. అడపాదడపా ప్రెస్‌మీట్‌ పెట్టడమే గొప్ప… బీజేపీలో ఓ వర్గం వైసీపీ, మరో వర్గం టీడీపీవైపు మొగ్గు చూపుతున్నాయన్నది ఆ పార్టీ కార్యకర్తల్లో టాక్… పోనీ ఆ పార్టీల్లో ఏదో ఓ దానితో కలసి పనిచేస్తామని స్పష్టంగా చెబుతారా అంటే అదీ లేదు. పోనీ జనసేనతోనే పొత్తు కంటిన్యూ అవుతుందా అంటే అదీ స్పష్టంగా చెప్పలేరు. పవన్ మాతోనే అని కాసేపు చెబుతారు… కాసేపు ప్రజలతోనే పొత్తంటారు… అసలే మాత్రం క్లారిటీ లేని ఫుల్ కన్ఫ్యూజన్ పార్టీ ఏపీ బీజేపీనే…

బీజేపీ అధినాయకత్వమన్నా స్పష్టత ఇస్తుందా అంటే అదీ లేదు. ఏపీలో ఎంత చేసినా తమది తోకపార్టీనేనని అర్థమైపోయినట్లుంది. అందుకే లైట్ తీసుకుంటోంది. సింగిల్‌పోటీ చేస్తే సింగిల్ సీటైనా వస్తుందా అన్న అనుమానం ఆ పార్టీ హైకమాండ్‌కే ఉంది. పోనీ వేరే ఎవరితోనైనా కలసి పోటీ చేసినా సీట్లు సింగిల్ డిజిట్ మాత్రం దాటవు. అందుకే ఏపీపై పెద్దగా ఎఫర్ట్ పెట్టడం లేదు కమలం అధినాయకత్వం. దీంతో ఎవరిదారి వారిదే అన్నట్లు నేతలున్నారు.

ఇది ఎన్నికల నామ సంవత్సరం.. ఇప్పటికే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ టాప్‌కు చేరింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, వైసీపీలు దూకుడు పెంచాయి. ఆ పార్టీ నేతలు జనంలోనే ఉంటున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. మరి బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు…? పార్టీ నేతలుండి, గ్రామగ్రామాన కార్యకర్తలున్న పార్టీలే గెలుపు కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటే.. అంతంతమాత్రంగా కార్యకర్తలు, ప్రజాదరణ ఉన్న ఏపీ బీజేపీ ఏం చేయాలి…? ఏం చేస్తోంది…? ఈ ఎన్నికల్లో గెలవకపోయినా కనీసం వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయాలి కదా… మరి చేస్తోందా…?

తెలంగాణలో కూడా ఒకప్పుడు కమలానికి ఆదరణ అంతంతే… కానీ ఆ తర్వాత పుంజుకుంది. హైకమాండ్‌ కూడా ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో ఎంతో కొంత మంచి ఫలితాలే సాధిస్తోంది. మరి ఏపీ బీజేపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది. నేతలు ఇలాగే ఉంటే పార్టీ పరిస్థితి ఇక ఎప్పటికీ అలాగే ఉంటుంది. మరో తోకపార్టీగానే మిగిలిపోవడం గ్యారెంటీ.

(KK)