Ysrcp Vs BJP: వైసీపీపై బీజేపీ ఎటాక్.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ డిమాండ్..!

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, రాష్ట్రంలో రోడ్ల గురించి బీజేపీ ప్రశ్నించింది. ప్రత్యేక హోదా సంగతేంటని వైసీపీ వాదిస్తోంది. ఎప్పట్లాగే చంద్రబాబు చెప్పినట్లే పురందేశ్వరి నడుచుకుంటున్నాని కౌంటర్ ఇస్తోంది. దీంతో బీజేపీ కూడా అంతే ఘాటుగా స్పందిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 04:41 PM IST

Ysrcp Vs BJP: ఒకవైపు కేంద్రంలో బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తోంది. మరోవైపు ఏపీలో వైసీపీకి బీజేపీ సహకారం అందిస్తోంది. అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఏపీలో మాత్రం బీజేపీ, వైసీపీ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. అధికార వైసీపీని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సహా ఆ పార్టీ నేతలు విమర్శిస్తుంటే.. వైసీపీ కూడా అంతే ఘాటుగా బదులిస్తోంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, రాష్ట్రంలో రోడ్ల గురించి బీజేపీ ప్రశ్నించింది. ప్రత్యేక హోదా సంగతేంటని వైసీపీ వాదిస్తోంది. ఎప్పట్లాగే చంద్రబాబు చెప్పినట్లే పురందేశ్వరి నడుచుకుంటున్నాని కౌంటర్ ఇస్తోంది. దీంతో బీజేపీ కూడా అంతే ఘాటుగా స్పందిస్తోంది. తాజాగా బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి వైసీపీకి 9 ప్రశ్నలు సంధించారు. పురందేశ్వరిని వ్యక్తిగతంగా విమర్శించే ముందు మంత్రులు.. ఏపీకి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అడిగిన తొమ్మిది ప్రశ్నలు ఇవి.
* బాలల అక్రమ రవాణాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఈ వైఫల్యానికి బాధ్యులెవరు..?
* దేశ తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎందుకు వెనుకబడిపోయింది?
* జలజీవన్ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం ఎందుకు ఉపయోగించుకోలేదు.? ప్రజలకు మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేదు..?
* 80 శాతం కార్పొరేట‌్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు కావడం లేదు..? ఆస్పత్రులకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు..?
* పేదలకు వైద్య సేవలు అందించడంలో ఎందుకు విఫలమయ్యారు..? పట్టణ, గ్రామీణ వైద్యారోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, జనరల్ హాస్పిటల్స్‌లో సరైన వైద్య సదుపాయాలు ఎందుకు లేవు..? ఔషధాల కొరతకు కారణం ఏంటి? వైద్యశాఖలో ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయడం లేదు..?
* పేదల కోసం కేంద్రం కేటాయించిన 25 లక్షల ఇండ్లను ఎందుకు నిర్మించలేకపోయారు..?
* రాష్ట్రంలో పాడైన రహదారుల్ని ఎందుకు బాగు చేయడం లేదు..? వైసీపీ మంత్రులు కారు యాత్రలు చేస్తే రోడ్ల దుస్థితి తెలుస్తుంది..?
* ఉన్నత విద్యను ఎందుకు నిర్లక్ష‌్యం చేశారు? పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఎందుకు ఇవ్వడం లేదు? డిగ్రీలో తెలుగు మీడియాన్ని ఎందుకు రద్దు చేశారు..? ఇంగ్లీష్ మీడియానికే ప్రాధాన్యం ఎందుకు..?
* రాష‌్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల్ని ఎందుకు భర్తీ చేయడం లేదు..?