AP Cabinet: ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ! కేబినెట్‌లోకి వచ్చేదెవరు.. పోయేదెవరు?

ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. రాజకీయం భగ్గుమంటోంది ఏపీలో ! టీడీపీ, జనసేన దూసుకుపోతుంటే.. ఆ రెండు పార్టీలకు కళ్లెం వేసేలా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న తప్పు జరగకుండా ప్లాన్ చేస్తున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఓడిపోవడంతో.. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు జగన్‌ సిద్ధం అవుతున్నారు. మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించేందుకు సన్నద్దం అవుతున్నారు.

  • Written By:
  • Updated On - March 27, 2023 / 03:54 PM IST

గవర్నర్‌తో భేటీలో అదే చర్చ జరిగింది.. దీనికి సంబంధించి జగన్ సమాచారం కూడా అందించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేబినెట్‌ బెర్త్‌ ఎవరికి.. ఎర్త్ ఎవరికి అనే ఆసక్తి కనిపిస్తోంది. కొందరు మంత్రుల్లో అయితే టెన్షన్‌ పీక్స్‌కు చేరింది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. జగన్ ముందుగానే హింట్ ఇచ్చారు. పనితీరు బాగోలేకపోతే పక్కన పెడతానని స్ట్రాంగ్‌గానే చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత అదే చేసి చూపించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. కేబినెట్‌లో ఇప్పుడున్న వారిలో కొందరిని తప్పించి.. కొత్తవాళ్లకు జగన్ స్థానం కల్పిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. గత ఏప్రిల్‌లోనే కేబినెట్‌ విస్తరణ జరిగింది. ఇందులో చాలామందిని కొత్తవాళ్లనే తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి మార్పులు చేర్పులు చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారు.

ఐతే ఈసారి శాఖల్లో ఎక్కువగా మార్పులు ఉంటాయని.. ముగ్గురు లేదా నలుగురు మంత్రులను మార్చే చాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. కులసమీకరణాలు, పనితీరు ఆధారంగా ఈ మార్పులు ఉండబోతున్నాయ్. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ఎన్నికయిన మర్రి రాజశేఖర్‌తోపాటు తోట త్రిమూర్తులు, కౌరు శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఎవరిని తప్పిస్తారన్న దానిపై మాత్రం రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. విడదల రజిని, దాడిశెట్టి రాజా తప్పించే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయ్. రాయలసీమ తూర్పు, పశ్చిమతో పాటు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఆ ప్రాంతాలకు చెందిన మంత్రులకు కూడా డేంజర్‌ పొంచి ఉందనే చర్చ జరుగుతోంది.