AP CID CHIEF SANJAY: ఏపీ సీఐడీ పాట్లు..! తప్పులేదని చెప్పుకునేందుకు తంటాలు..!

ఓ ప్రభుత్వ అధికారిగా కేసుకు సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టొచ్చు లేదా నోట్ విడుదల చేయవచ్చు. కానీ ఆయన అంతకు మించి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి మరీ నేషనల్ మీడియాకు వివరించాల్సిన అవసరం అసలు లేదు.

  • Written By:
  • Updated On - September 17, 2023 / 07:43 PM IST

AP CID CHIEF SANJAY: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పక్కా పొలిటీషియన్‌లా మారిపోయారు. తానో అధికారినన్న సంగతి మర్చిపోయి పాలిటిక్స్‌లో మునిగి తేలుతున్నారు. అధికారపక్షం ప్రాభవం కోసం ఆయన లక్ష్మణరేఖ దాటుతున్నారు. తాము చేసింది రైటే అని చెప్పుకోవడానికి ఆయన పడుతున్న పాట్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.
చంద్రబాబును అరెస్ట్ చేసిన వెంటనే సీఐడీ చీఫ్‌గా ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో మీడియాకు వివరించారు సంజయ్. ప్రజల్లో ఎలాంటి సందేహాలు రాకుండా ఇలా వివరణ ఇవ్వడం మంచిపనే. బాబుకు వ్యతిరేకంగా తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. అందుకే అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. దీన్లో కూడా ఎలాంటి వివాదమూ లేదు. కానీ, ఆ తర్వాత సంజయ్ వ్యవహరిస్తున్న తీరే కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సంజయ్ వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టారు. తన కార్యాలయంలో రెండ్రోజులు వరుసగా మీడియాతో మాట్లాడారు. తమ చర్యలను సమర్ధించుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కూడా ప్రెస్‌మీట్ పెట్టారు. పొన్నవోలుతో కలిపి మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియాను టార్గెట్ చేసి తమ వాదన వినిపించారు. చంద్రబాబు నేరస్తుడనేలా తామే తీర్పు కూడా ఇచ్చేశారు. ఇక పొన్నవోలు అయితే తప్పు చేస్తే జైల్లో పెట్టక ఏం చేయాలి అంటూ మాట్లాడారు. నేరం రుజువుకాకుండా అలా మాట్లాడకూడదని సుదీర్ఘ అనుభవం ఉన్న పొన్నవోలు లాంటి లాయర్లకు తెలియనిది కాదు.

అంతేకాదు ఢిల్లీ వెళ్లి మరీ నేషనల్ మీడియాను కలిశారు సంజయ్. ఓ అధికారిగా తన పని తాను చేసుకోవాల్సింది పోయి.. ఇలా మీడియాతో మాట్లాడటం కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న వాదనలున్నాయి. ఇప్పుడు సీఐడీ చీఫ్ తీరు చూస్తుంటే అది నిజమేనా అనిపిస్తోంది. తమ వాదనలో పస ఉంటే, నిజంగా ఆధారాలు ఉంటే ఎందుకింత తాపత్రయం అన్నది పెద్ద ప్రశ్న. ఓ ప్రభుత్వ అధికారిగా తన పని తాను చేసుకుపోవాలి. కేసుకు సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టొచ్చు లేదా నోట్ విడుదల చేయవచ్చు. కానీ ఆయన అంతకు మించి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చి మళ్లీ చెప్పిందే చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీకి వెళ్లి మరీ నేషనల్ మీడియాకు వివరించాల్సిన అవసరం అసలు లేదు. కానీ, మరి సంజయ్ మాత్రం తాము చేసింది రైటే అని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వార్తలు రావడంతో తమ వాదనను సమర్ధించుకోవడానికి ప్రభుత్వం సంజయ్‌ను ఢిల్లీ పంపుతున్నారన్న వాదన కూడా ఉంది. కానీ ఆయనో అధికారి. కేసు దర్యాప్తుపై ఫోకస్ పెట్టకుండా అధికారపార్టీ ప్రాభవం కోసం ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
సాధారణంగా సంబంధిత శాఖ మంత్రులు కేసుకు సంబంధించిన వివరాలు చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం ఆ మంత్రులు రాజకీయ ఆరోపణలు తప్ప.. కేసుకు సంబంధించి వారికి ఎలాంటి వివరాలు తెలిసినట్లు లేవు. అందుకే ఆయా మంత్రులెవరూ నోరు విప్పడం లేదు. ఆయా మంత్రులెవరికీ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకుండా అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచే కథ నడిచినట్లు తెలుస్తోంది. కానీ సంజయ్ మాత్రం అన్నీ తానై మాట్లాడేస్తున్నారు. ఇక చంద్రబాబు భద్రతకు సంబంధించి కూడా ఏఏజీ పొన్నవోలు మాట్లాడుతున్నారు. కానీ అసలు స్పందించాల్సిన పోలీస్ బాస్. కానీ, డీజీపీ కూడా ఎక్కడా నోరు తెరవలేదు. దీన్నిబట్టి చూస్తుంటే అసలు సంజయ్ లేదా పొన్నవోలు తప్ప ఎవరూ కేసుకు సంబంధించిన వివరాలు మాట్లాడొద్దని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తుంటే సరైన ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేసారన్న వాదనలకు ప్రభుత్వ పెద్దల తీరే బలం చేకూరుస్తున్నట్లు కనిపిస్తోంది.