చంద్రబాబు తొలిరోజు సీఐడీ విచారణలో ఏం జరిగింది..!?

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలు కాన్ఫరెన్స్‌ హాలులో ఆయనను అధికారులు విచారించారు.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 05:57 PM IST

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలు కాన్ఫరెన్స్‌ హాలులో ఆయనను అధికారులు విచారించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి చంద్రబాబును శనివారం ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దర్యాప్తు చేశారు. ఇవాళ ఉదయం 2 గంటల పాటు, మధ్యాహ్నం 3 గంటల పాటు చంద్రబాబుకు సీఐడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో ఈ ఎంక్వైరీ కొనసాగింది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు మెడికల్ టెస్టులు చేశారు. చంద్రబాబును ప్రశ్నించే క్రమంలో.. కోర్టు పెట్టిన షరతుల మేరకు విచారణకు విరామం ఇచ్చారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేశారు. ఈ కేసులో చంద్రబాబును మొత్తం 120 ప్రశ్నలు అడగాలని ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం. వాటిలో 50 ప్రశ్నలను శనివారం అడిగారని తెలుస్తోంది. ‘‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు విలువను ఎలా నిర్ణయించారు ?, సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు?, ఆ కంపెనీతో అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది?, జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు..?, 13 చోట్ల నోట్ ఫైళ్లపై సంతకం చేసి, అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు..?, డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులను తరలించడం మీకు తెలుసా?’’ వంటి ప్రశ్నలను చంద్రబాబును అడిగారని అంటున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను కలిగిన 473 పత్రాలను చంద్రబాబు ముందు ఉంచిన సీఐడీ టీమ్ వాటిపైనా ఆయనను ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు చెప్పిన సమాధానాలను రికార్డు చేసి ధర్మాసనానికి సమర్పించాల్పి ఉంటుంది. ఇక ఆదివారం కూడా చంద్రబాబును ప్రశ్నించనున్నారు. కాగా, విచారణ అనంతరం సీఐడీ టీమ్ సెంట్రల్ జైలు నుంచి ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ కు వెళ్లింది.

సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్

మరోవైపు చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు సమర్పించారు. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో చంద్రబాబు తరపు లాయర్లు పేర్కొన్నారు. అది సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.