YS Jagan: జగన్ త్రిముఖ వ్యూహం

ఏపీ సీఎం జగన్ గేరు మార్చబోతున్నారు. ఇంతకాలం మీడియం స్పీడ్‌తో ముందుకెళ్లిన ఆయన ఇకపై దూకుడుగా ముందుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుుంటున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో మూడంచెల యుద్ధవ్యూహాలకు పదును పెడుతున్నారు. త్రిముఖ వ్యూహం.. అవును పాలన, అభివృద్ధి, పార్టీ.. ఈ మూడు అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

  • Written By:
  • Updated On - August 1, 2023 / 02:22 PM IST

ఇంతకాలం పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత. అయితే ఎన్నికలకు ఎంతో కాలం లేకపోవడంతో ఇక పార్టీపై పూర్తిస్థాయి దృష్టిపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు చురుగ్గా సాగుతోంది. అటు ప్రజలను మరింత ఆకట్టుకోవడంతో పాటు ఇటు పార్టీని యుద్ధానికి సిద్ధం చేయడం లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ కావడంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. అది వైసీపీ పెద్దలకూ అర్థమైంది. అది మరింత పెరగకుండా చూడటానికి చర్యలు తీసుకోబోతున్నారు. ఏఏ వర్గాల్లో తమపై అసంతృప్తి ఉందో నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం దాన్ని తగ్గించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

గెలుపు గుర్రాలను ఫైనలైజ్ చేసే పని కూడా మరోవైపు నుంచి జోరుగా సాగుతోంది. ఎవరిని ఉంచాలి, ఎవరిని తప్పించాలనేదానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ లిస్టును బయటపెట్టకుండా ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్. ఇంటింటికీ తిరిగేలా ఆదేశించడమే కాదు ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నారు. జనానికి దూరంగా ఉంటున్న నేతలకు క్లాసులు పీకుతున్నారు. తాను కూడా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోనే ప్రారంభిస్తున్నారు. జిల్లాలు తిరుగుతున్నారు. ఇకపై మరింతగా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు జగన్. ఎన్నికల వేళ పార్టీల్లో జంపింగ్‌లు సహజమే. అలా అధికారపార్టీ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నవారి జాబితాను సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి చేరడానికి సిద్ధంగా ఉన్న నేతలపైనా ఫోకస్ పెట్టారు.

నవరత్నాల్లాంటి మరిన్ని ప్రజాకర్షక పథకాలపై కసరత్తు చేస్తున్నారు జగన్. అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రత్యేక పథకాలు తాడేపల్లి ప్యాలెస్‌లో రెడీ అవుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకోవడానికి డీఎస్సీని ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలపై ఒత్తిడి తెచ్చి అయినా వెంటనే కార్యకలాపాలు ప్రారంభింపచేసేలా చూడాలని భావిస్తున్నారు. వరుసగా వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ అభివృద్ధి జరుగుతుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది జగనన్న వ్యూహం. అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తున్న విపక్షాలకు దీంతో చెక్ చెప్పినట్లు అవుతుందని భావిస్తున్నారు. రాష్ట్రం ప్రభుత్వం పంచిపెట్టడం తప్ప సంపద పెంపుపై ఫోకస్ పెట్టలేదన్న విమర్శలున్నాయి. దానికి చెక్ పెట్టేలా జగన్ వ్యూహం ఉండబోతోంది.