ముఖ్యంగా 27మంది ఎమ్మెల్యేలను అయితే.. పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు జగన్. పనితీరు మార్చుకోవాలని లేకపోతే పక్కనపెట్టడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు. జగన్ భయంతో.. నచ్చినా నచ్చకపోయినా జనంతో జనంలా ఉండడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. కట్ చేస్తే సీన్ రివర్స్! గడపగడపకు కార్యక్రమంపై జగన్ మరోసారి రివ్యూ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఫలితాలో తలబొప్పి కట్టిన వేళ.. మిగతావాటితో కంపేర్ చేస్తే.. ఈ సమావేశం అంతకుమించి అనిపించడం ఖాయం అని.. జగన్ విశ్వరూపం చూస్తారని.. పేర్లు చెప్పి మరీ కొందరు ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం ఖాయం అనే ప్రచారం మీటింగ్ ముందు వినిపించింది.
ఐతే ఆ అంచనాలన్నీ తుస్సుమన్నాయ్. జగన్ తీరు సొంత పార్టీ నేతలనే కాదు.. రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. గతంలో నేతలకు వార్నింగ్‌లు ఇచ్చిన జగన్.. విన్నపాలు వినవలె అనే రేంజ్‌లో అందరినీ పలకరించారు. అందరికీ కీలక సూచనలు చేశారు. దీనికి అంతటికి కారణం.. ఎమ్మెల్సీ ఫలితాలే అనే చర్చేనా అంటే.. కచ్చితంగా అవును అంటున్నారు కొందరు. ముగ్గురు పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఓడిన తర్వాత.. జగన్ నిర్వహించిన మీటింగ్ హాట్‌హాట్‌గా ఉంటుందని అంతా అనుకున్నారు. రాయలసీమ పశ్చిమ, తూర్పుతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులకు ఝలక్ తగలడం ఖాయం అని అంతా భావించారు. గ్రాఫ్ బాగోలేని నాయకులకు టికెట్‌లు ఇవ్వలేమని మొహం మీదే చెప్తారనే టెన్షన్ కనిపించింది.
ఐతే ఎవరినీ వదులుకోను అంటూ ఎమ్మెల్యేలను ప్రాధేయపడినట్లు జగన్ మాట్లాడడం.. విచిత్రంగా అనిపించింది అందరికీ ! 50మంది ఎమ్మెల్యేలను మార్చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి.. ఒక్క మాటతో జగన్ ఫుల్‌స్టాప్ పెట్టారు. పైగా మీకు దెబ్బ తగిలితే.. నాకు దెబ్బ తగినట్లు కాదా.. ఎవరినైనా ఊరికే ఎందుకు తీసేస్తాను చెప్పండి.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా.. టెన్షన్ పడకండి.. కలిసి నడుద్దాం.. కలిసి సాగుదామని.. పొలిటికల్ బలగం సినిమాను మీటింగ్‌లో కళ్ల ముందు చూపించినట్లు కనిపించారు. ఇక్కడితో ఆగారా.. వచ్చిన నేతలను జగన్ పలకరించడమే గగనం అనే ప్రచారం ఉంది.
అలాంటిది మీటింగ్ వచ్చిన నేతంలదరికీ ఒకటికి రెండుసార్లు థ్యాంక్స్ చెప్పారు. ఇలా చెప్పడం నిజానికి ఇదే ఫస్ట్ టైమ్. జగన్‌ను ఇలా ఎప్పుడూ చూడలేదని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. తాను చెప్పింది విని వెళ్లాలి అన్నట్లు కనిపించే జగన్‌లో భారీ మార్పు కనిపించింది. ఈ మార్పు మొత్తానికి కారణం.. ఎమ్మెల్సీ ఫలితాలే ! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీతో పాటు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీలను వైసీపీ కోల్పోయింది. చదవడానికి అది ముగ్గురే అయినా.. 108 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుంది. 108 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పు అది! పైగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కట్టప్పలుగా మారడం.. ఆ తర్వాత జగన్ టార్గెట్‌గా వాళ్లు కామెంట్లు చేయడం.. వైసీపీని ఇబ్బంది పెట్టింది.
ఇలాంటి పరిణామాల మధ్య జగన్ తీర్పు పూర్తిగా మారిపోయింది. అహం తగ్గిందా.. డిక్టేటర్‌షిప్ మారిందో లేదో తెలియదు కానీ.. వార్నింగ్‌లు ఇచ్చే వ్యక్తి ఇప్పుడు వేడుకుంటున్నారు. అందరినీ ప్రేమగా పలకరిస్తున్నారు. నీ కష్టం నా కష్టం కాదా అంటూ భరోసా ఇసతున్నారు. ఎవరినీ ఊరికే తప్పించనని చెప్తూనే..తప్పించిన వాళ్లకు ఎమ్మెల్సీ రూపంలోనో, కార్పొరేషన్ చైర్మన్ రూపంలోనే న్యాయం చేస్తామని హామీలు ఇస్తున్నారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తా.. జనాల్లోకి కాలర్ ఎగరేసి వెళ్లండి.. ధైర్యంగా ఉండండని అంటున్నారు.
టికెట్ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని.. పదేపదే చెప్పారు మీటింగ్‌లో ! వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ ఎలా లాక్కుందన్న దానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నా.. ఆ నలుగురిలో కనిపించిన భయం మాత్రం ఒక్కటే.. అదే టికెట్ రాదని! 2024లో సీటు రాదన్న పక్కా సమాచారంతోనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. టీడీపీకి ఓటేశారు. ఇదే ఇప్పుడు జగన్‌లో మార్పునకు కారణంగా కనిపిస్తోంది. ఓటమి కారణం చూపించో.. పని తీరు కారణం చూపించో.. టికెట్ ఇవ్వను అంటే.. ఉన్న వాళ్లు కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉందని గ్రహించే జగన్ తన స్వరం మార్చారన్నది చాలా మంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.