YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. వైసీపీ ప్లాన్ మారుతోందా..?

ఏపీలో మాత్రం ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార వైసీపీపై జనసేన, టీడీపీ విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా వారాహి యాత్ర ద్వారా పవన్ జనంలోకి దూసుకెళ్తున్నారు. ప్రతి చోటా వైసీపీ అవినీతి, వైఫల్యాల్ని పవన్ ఎండగడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 02:38 PM IST

YS Jagan: తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ రాజకీయం వేడెక్కింది. తెలంగాణలో మూడు నెలల్లో ఎన్నికలుంటే.. ఏపీలో మాత్రం ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార వైసీపీపై జనసేన, టీడీపీ విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా వారాహి యాత్ర ద్వారా పవన్ జనంలోకి దూసుకెళ్తున్నారు. ప్రతి చోటా వైసీపీ అవినీతి, వైఫల్యాల్ని పవన్ ఎండగడుతున్నారు. పవన్ యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మరోవైపు టీడీపీ కూడా బలం పెంచుకుంటోంది. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆలస్యం చేస్తే మరింత వ్యతిరేకత పెరుగుతుందని భావించిన జగన్ ముందుస్తు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీకి పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆలస్యమయ్యేకొద్దీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగొచ్చు. అందుకే ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటుందా అని వైసీపీ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. చివరకు మెడికల్ లీవులు కావాలన్నా.. కలెక్టర్ అనుమతి తీసుకోవాలని సూచించింది. అలాగే కలెక్టర్లు వీవీ ప్యాట్లను తనిఖీ చేశారు. సీఎం జగన్ వైసీపీ కోర్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇవన్నీ చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారా అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల్నుంచి తప్పించాలని వైసీపీ భావిస్తోంది. ఉపాధ్యాయుల స్థానంలో సచివాలయ ఉద్యోగుల్ని వినియోగించుకోవాలని వైసీపీ ఆలోచిస్తోంది. దీనికి ఉపాధ్యాయులు అంగీకరిస్తారా అన్నది తేలాలి. ప్రభుత్వం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ముందస్తు ఎన్నికలపై ఏపీలో వైసీపీనే కాదు.. అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది అని కాకుండా.. ఈ డిసెంబర్‌లోనే ఎన్నికలు జరగొచ్చనే ప్రణాళికతో ఉన్నాయి. ముందస్తుపై ఇటీవల బీజేపీ కూడా చర్చించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో దీని గురించి ప్రస్తావించారు. ఇక.. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడటం కూడా ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. వివిధ ప్రాంతాల్లో వారాహి యాత్ర నిర్వహించిన పవన్ అక్కడ స్థానిక సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని, అవినీతి, కబ్జాల గురించి ప్రస్తావించడంతో స్థానికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో జనసేనకు ఆదరణ పెరుగుతుండటం వైసీపీని కలవరపెడుతోంది. ఉత్తరాంధ్రలో జనసేనకు మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది. రోజులు గడిచేకొద్దీ జనసేనకు ఆదరణ పెరిగి, వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమవ్వొచ్చు. అలాగే టీడీపీ కూడా గతంలోకంటే బలంగా కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూర్చుకోవడం కూడా కష్టంగా మారింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందంటూ సర్వేలు వెల్లడిస్తున్నా.. జనం వీటిని నమ్మే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా ముందస్తు ఎన్నికలకు వెళ్లటమే మంచిదని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.