బీజేపీకి హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. పొత్తుకు ఓకే కానీ.. కండిషన్స్ అప్లయ్ అన్నారు సేనాని. గౌరవప్రదమైన పొత్తులను మాత్రమే స్వాగతిస్తామని అన్నారు. పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సీట్లు కేటాయిస్తేనే పొత్తుకు సిద్ధం అని పవన్ చెప్పకనే చెప్పేశారు. ఇక్కడ పడిన పీటముడి.. అసలు వీడడం లేదు. 50 ప్లస్ కావాలని జనసేన.. అన్ని సీట్లు ఇస్తే ఇద్దరం నిండా మునుగుతామని టీడీపీ.. ఆ రోజు నుంచి సీట్ల పంపకాలపై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయ్. 25 అసెంబ్లీ సీట్లు ఇచ్చి.. ఎన్నికల ఖర్చు అంతా తాము భరిస్తామని ఓసారి టీడీపీ ఆఫర్ ఇవ్వగా.. దానికి జనసేన సంతృప్తిగా కనిపించినట్లు అనిపించలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు జనసేనకు ఫైనల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
25 అసెంబ్లీ సీట్లు.. 3 లోక్‌సభ స్థానాలు జనసేనకు కేటాయించేందుకు సిద్ధం అని.. పవన్ ముందు చంద్రబాబు ఫైనల్ ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకుమించి ఎక్కువ స్థానాలు కేటాయించినా.. అది తమకంటే మీకే ఎక్కువ నష్టం అని పవన్‌ను చంద్రబాబు సముదాయించారనే గుసగుసలు ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి అదే నిజం కూడా ! గత ఎన్నికలతో కంపేర్ చేస్తే.. జనసేన బలం భారీగా పెరిగింది. ఐతే అద్భుతాలు క్రియేట్ చేసేంత బలం మాత్రం గ్లాస్ పార్టీ అందుకోలేదు. చాలాచోట్ల గెలుపును డిసైడ్ చేసే స్థానంలో ఉంది తప్ప.. ఒంటరిగా నిల్చున్నా గెలిచే పరిస్థితి పవన్ పార్టీకి లేదు. పైగా పార్టీకి ఆర్థిక వనరులు కూడా అంతంతమాత్రమే ! ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పి.. పవన్ ముందు చంద్రబాబు ఫైనల్ ఆఫర్ పెట్టారని తెలుస్తోంది.
ఐతే అధికారంలోకి వచ్చాక.. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో పెద్దపీట వేస్తామని.. పవన్‌కు చంద్రబాబు హామీ ఇచ్చారని టాక్. ఐతే మరో ఐదు స్థానాలు ఇవ్వండని పవన్ బేరాలు పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి చంద్రబాబు అంగీకరిస్తారా.. చంద్రబాబు అంగీకరించకుంటే దాన్ని జనసేన ఒప్పుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కటి మాత్రం నిజం.. ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తే ఇద్దరికీ నష్టం. అలా అని సీట్ల విషయంలో తగ్గితే.. తర్వాత కష్టం ! పొత్తు వ్యవహారం నెగ్గాలంటే.. ఇద్దరు అంతో ఇంతో తగ్గాలి. లేదంటే ఇద్దరి మధ్య పంచాయితీ.. వైసీపీకి ప్లస్ అయ్యే చాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిణామాల మధ్య సేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ స్థానాల సంగతి ఎలా ఉన్నా.. నాలుగు పార్లమెంట్ స్థానాల మీద జనసేన చాలా ఆశలు పెట్టుకుంది. అవే విశాఖ, తిరుపతి, కాకినాడ, నరసాపురం.. ఈ నాలుగు స్థానాల్లోనూ లోక్‌సభకు పోటీ చేసేందుకు జనసేన ఆసక్తి చూపిస్తోంది. ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గ ఓటర్లు కీలకంగా ఉన్నారు. నిజానికి 2019లో టీడీపీ, జనసేన పొత్తులో ఉంటే.. ఈ నాలుగు స్థానాలు వీళ్ల ఖాతాలోనే పడి ఉండేవి ! ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నా.. టీడీపీ ఫైనల్ ఆఫర్‌కు పవన్ ఒప్పుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న.