TOP STORY: జగన్ మరో తప్పు చేయబోతున్నారా…? జనంలోకి ఎందుకు వెళుతున్నారో…!

వైసీపీ అధినేత జగన్ మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారా...? పోయిన చోటే తిరిగి వెతుక్కోవాలనుకుంటున్నారా...? ఇంతకీ జగన్‌ పర్యటనలు ఎందుకోసం...? ప్రభుత్వాన్ని ఎండగట్టడానికా.. ? లేక పార్టీని కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గం అనుకుంటున్నారా...? జగన్‌కు ఈ సలహా ఇచ్చింది ఎవరు...?

  • Written By:
  • Publish Date - October 13, 2024 / 10:22 AM IST

వైసీపీ అధినేత జగన్ మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారా…? పోయిన చోటే తిరిగి వెతుక్కోవాలనుకుంటున్నారా…? ఇంతకీ జగన్‌ పర్యటనలు ఎందుకోసం…? ప్రభుత్వాన్ని ఎండగట్టడానికా.. ? లేక పార్టీని కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గం అనుకుంటున్నారా…? జగన్‌కు ఈ సలహా ఇచ్చింది ఎవరు…?

రాజకీయ నాయకులు జనంలో ఉండటం సహజమే. సాధారణంగా ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి జనంలోకి వెళతారు. ఎన్నికల ఏడాది అయితే పూర్తిగా జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎన్నికలై ఆరునెలలు గడిచాయో లేదో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన వ్యూహం జనం సమస్యలు తెలుసుకోవడం కాదు.. తనను సమస్యలు చుట్టుముట్టకుండా చూసుకోవడం.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ఊహించని దెబ్బకొట్టారు ఏపీ ఓటర్లు. ఆ దెబ్బకు జగన్‌కు మైండ్‌బ్లాంక్ అయ్యింది. ఆ పరాభవం, పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇదే సమయంలో మీ వైఖరి మాకు నచ్చలేదంటూ కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. ఇటు అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురులేదని అహంభావంతో చేసిన పనులు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ సమయంలో మరోసారి జనంలోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నుంచి జిల్లాల పర్యటనలు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది. బస్సు యాత్ర చేయాలా లేక మినీ పాదయాత్రలు నిర్వహించాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. పాలనను పరుగులు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం మూలాలను తవ్వి తీస్తోంది. మరోవైపు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఫ్యాను కట్టేసి సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీని వీడారు. జగన్‌కు మొదట్నుంచి అండగా ఉన్న మోపిదేవి వంటి వారు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొందరు కూడా అదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక సీనియర్‌ నేతలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారిలో చాలామంది సైలెంట్‌మోడ్‌లో ఉన్నారు. దీంతో పార్టీ నుంచి ఫిరాయింపులు ఆపాలన్నా, పార్టీ కాస్తో కూస్తో ఫైట్‌ మోడ్‌లోకి రావాలన్నా తాను జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారు జగన్. తాను జనంలో ఉంటేనే పార్టీ మారలనుకునేవారు కాస్త వెనక్కు తగ్గుతారనేది జగన్ ఆలోచన.

జగన్ జనంలోకి వెళ్లాలనుకోవడానికి వేరే కారణం కూడా ఉంది. పార్టీతో పాటు తనను తాను కాపాడుకోవడాల్సిన తక్షణ అవసరం జగన్‌కు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ గానక చాలా అడ్డగోలు పనులు చేశారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధైర్యంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదు. రూల్స్‌ అనేవి లేవు.. IPC కాకుండా YCP రూల్స్ నడిచాయి. అధికారులు కూడా ఇక TDP కోలుకోవడం కష్టమని నమ్మి అధికారపార్టీ చెప్పినట్లు తలాడించారు. ఇప్పుడు అవన్నీ తవ్వితే అది ఎక్కడ తనకు చుట్టుకుంటుందో అని జగన్ భయపడుతున్నారు. అందుకే జనం బాట పడుతున్నారు. కనీసం తాను జనంలో ఉంటే అధికారపార్టీ దూకుడుగా వ్యవహరించడానికి వెనుకాడుతుందన్నది జగన్ ఆలోచన. పైగా CBI కేసుల్లో కూడా జగన్‌కు తిప్పలు తప్పేలా లేవు. ఇవన్నీ ఆలోచించాకే జగన్‌ జనంలోకి వెళ్లాలని డిసైడయ్యారు. లడ్డూ కుంభకోణంలో వైసీపీ కాస్త ఆత్మరక్షణలోకి వెళ్లింది. సుప్రీం తీర్పును తనకు అన్వయించుకుని ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగినా జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. టీడీపీ ప్రభుత్వం అలాంటివి మరిన్ని బయటకు తీస్తే తను ఇరుక్కుపోతానన్న భయం వైసీపీ అధినేతలో బలంగానే ఉన్నట్లుంది.

జగన్‌ఆలోచనల వెనక వేరే కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీని ఏ మాత్రం కుదురుకోనివ్వకూడదన్నది జగన్ ఆలోచన. గత ఐదేళ్లలో జగన్‌ పాలనను ప్రజలు చూశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఖచ్చితంగా ఈ పాలనకు, నాటి పాలనకు జనం పోల్చి చూస్తారు. అదే జరిగితే తనకు నష్టమన్నది వైసీపీ అధినేత భావన. అందుకే ప్రతి అంశంపైనా అనవసర రాద్ధాంతం చేసైనా సరే కూటమి సర్కార్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని భావిస్తున్నారు. జనంలోకి వెళ్లి కూటమి ఏమీ చేయట్లేదు అని చెప్పాలన్నదే జగన్ ఉద్దేశం. ఒకటికి పదిసార్లు చెబితేనైనా జనం నమ్ముతారేమోనన్నది జగన్ ఆశ. ఇప్పటికే సాక్షి పేపర్, టీవీ ప్రభుత్వం ఏర్పడిన వారం, పదిరోజుల్లోనే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టింది. నేను ఆ డబ్బులిచ్చాను… ఈ డబ్బులిచ్చాను… ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పడానికి స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ దిశగా జగన్‌కు ఆయన రాజకీయ వ్యూహకర్తలు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ ఐప్యాక్‌ను నమ్ముకుని బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు కూడా అలా వ్యూహకర్తలు ఇస్తున్న నిర్ణయంతోనే జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే నెగెటివ్ ప్రచారానికి దిగితే అది తనకే తిప్పుకొడుతుందేమో జగన్ ఆలోచించుకుంటే మంచిదని పొలిటికల్ విశ్లేషకులు సూచిస్తున్నారు.