NARA LOKESH: చంద్రబాబు తర్వాత.. నారా లోకేశ్ అరెస్ట్ ఖాయం అంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి తగ్గట్లుగానే ఢిల్లీకి వెళ్లి మరీ సీఐడీ అధికారులు.. లోకేశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీసులు ఇచ్చిన సీఐడీ.. లోకేష్ విచారణను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నెల 4న సీఐడీ విచారణ జరగాల్సి ఉండగా.. 10వ తేదీకి వాయిదా వేస్తూ.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ ఇచ్చిన 41A నోటీసులోని నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టులో లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. లోకేశ్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ మాత్రమేనని.. ఆయన తరఫు లాయర్లు వాదించారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని.. లోకేశ్‌ను ఇవి అడగడం కరెక్ట్ కాదని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఐతే తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని.. 4వ తేదీనే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు లాయర్ కోరారు. అంత తొందర ఎందుకు అని.. లోకేశ్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. రెండు వర్గాల వాదన తర్వాత.. లోకేశ్ విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని.. లాయర్‌ను అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని చెప్పింది.
అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ సర్కార్ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు.. గతేడాది ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.