ఇంటిగుట్టు ఇంతింత కాదయా అన్నట్లు ఉంది వైసీపీలో పరిస్థితి ! లోలోపల ఎన్ని పంచాయితీలు ఉన్నా.. బయటపడ్డాయంటే.. పదిమందిలో పలచన అవడమే కాదు.. ప్రత్యర్థికి ఆయుధం అందించినట్లు అవుతుంది. రాజకీయాల్లో అయితే ఇది మరీ ఎక్కువ. ఇప్పుడు వైసీపీ సీన్ అలానే ఉంది. ఓ వైపు అసంతృప్తులు.. మరోవైపు వర్గపోరు.. ఇంకోవైపు ఆధిపత్య పోరు.. ఇలాంటి పరిణామాల మధ్య ఫ్యాన్ రెక్కల చప్పుడు భయంకరమైన సౌండ్ ఇస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ కనీసం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. పిలిపించుకొని మాట్లాడం.. ఇంచార్జిలను మార్చేయడం ఇది కాదు కావాల్సింది ఇప్పుడు.. అంతకుమించి అనేలా ఉండాలి జగన్ జోక్యం. అదే మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఇక్కడ కాదు.. వైసీపీలో ప్రతీ జిల్లాలో ఇలాంటి పంచాయితీలే ఉన్నాయ్. నెల్లూరు పరిణామాలు పార్టీలో కొత్త చిచ్చు రేపితే.. గన్నవరం వైసీపీలో అంటుకున్న మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, గోదావరి జిల్లాలు… చివరికి సీఎం సొంత జిల్లా కడపలోనూ ఇదే పరిస్థితి. వైనాట్ 175 అంటూ జగన్ దూకుడు మీద కనిపిస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని ఆదేశిస్తున్నారు. ఈ ఒక్కసారి గెలిస్తే చాలు.. 30 ఏళ్లు తిరుగు ఉండదని జోష్ నింపుతున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే..? అంత సీన్ లేదు అనేలా అనిపిస్తున్నాయ్ పార్టీలో పరిస్థితులు. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ జిల్లాలు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. అసంతృప్తుల పోరు అనుకుంటే ఏదో అనుకోవచ్చు. వీటిలో చాలావరకు ఆధిపత్య పోరులే! కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటే సాల్వ్ అయ్యేవి చాలా ఉన్నాయ్. ఐనా సరే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కూర్చునే వాళ్లు.. కూర్చోమని చెప్పేవాళ్లు లేరు. సంక్షేమమే గెలిపిస్తుందని.. 175కు 175 స్థానాలు గెలిచితీరాలని పదేపదే చెప్తున్న జగన్.. ఇలాంటి వాటిపైన కనీసం దృష్టిసారించడం లేదు.
ఇక పార్టీలో సజ్జల, పెద్దిరెడ్డిలాంటి పెద్ద పెద్ద వాళ్లకు బాధ్యతలు అప్పజెప్తున్నారే తప్ప..తాను స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని కూల్ చేసేలా ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తల మీటింగ్ లో పాల్గొంటున్నారే తప్ప.. సొంత ఎమ్మెల్యేలతో కనీసం మంచిచెడ్డా ఆరా తీయడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పైకి బలంగా కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా సైడ్ మార్చేద్దామని చూసే వాళ్లూ లేకపోలేదు. ఇంత జరుగుతున్నా.. ఏ ఒక్కరు కూడా జగన్ ముందు కనీసం పెదవివిప్పని పరిస్థితి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే.. వైనాట్ 175 కాదు కదా.. మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉంటాయ్. ఇప్పటికైనా జగన్ రంగంలోకి దిగి.. దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఆనం, కోటంరెడ్డిలాగా మరికొన్ని స్వరాలు పార్టీలో రీసౌండ్ ఇచ్చే ప్రమాదం లేకపోలేదు. అదే కొనసాగితే.. క్లీన్ స్వీప్ కాదుకదా.. మళ్లీ సీటు ఎక్కాలన్నా కష్టపడక తప్పదు. ఇప్పుడు చేయవల్సిందల్లా ఒక్కటే అసంతృప్తులను బుజ్జగించడం, రెండవది వారిని తలదన్నే ధీటైన నాయకులను తయారు చేసుకోవడం. అయితే ఇక్కడ ధీటైన నాయకులను తయారు చేసుకునే పనిలో జగన్ ఎప్పడో ఉన్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే గతంలో ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశాల్లో చాలా సార్లు ఒకమాట చెప్పే వారు. ప్రజల్లో ఉండగలిగితేనే మరోక్క అవకాశం ఇస్తాను. సర్వేలో మంచి ప్రతిభ కనపరచకుంటే అవకాశం ఉండదు అని ముఖం మీద చెప్పేశారు. ఇందులో భాగంగా కొత్తనాయకులను తయారు చేసుకునే పనిలో ఉన్నారనే చెప్పాలి. ఈ ప్లాన్ ఎంత వరకు అధికారాన్ని అందిస్తుందో 2024 ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు.