AP Politics: బ్రహ్మనాయుడు మాటలతో భయంభయం.. పల్నాడు ఎన్నికల్లో భారీ హింస తప్పదా ?

వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాటలతో పల్నాడు రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. ఢీ అనే మనుషులు.. వేడి పుట్టించే పరిణామాలు.. ఫ్యాక్షన్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్ అనిపిస్తుంటుంది పల్ననాడు. ఎప్పుడూ పగతో రగిలిపోయే ప్రత్యర్థుల వేడితో.. చలికాలంలోనూ సెగలు రేపుతుంటుందు ఇక్కడి రాజకీయం. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కేంద్రంగా రాజ్యం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయ్. చరిత్రలో ప్రత్యేకంగా ఒక పేజీని లిఖించుకున్న పల్నాడు ఎప్పుడూ రాజకీయ రణరంగమే! ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క అనేలా ఇక్కడి రాజకీయాలు కనిపిస్తున్నాయ్. జరుగుతున్న గొడవలు.. కనిపిస్తున్న ఆందోళనలు.. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో టీజర్ చూపిస్తున్నాయ్.

  • Written By:
  • Publish Date - April 8, 2023 / 04:15 PM IST

మూడు నెలల కింద మాచర్లలో చోటుచేసుకున్న పరిణామాలు.. ఏపీ మొత్తాన్ని టెన్షన్ పెట్టాయ్. రాళ్లతో దాడులు, కర్రల ఫైట్‌లు.. వణికిపోయింది పల్నాడు ఆ రెండు రోజులు ! టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన గొడవలు.. రెండు పార్టీల మధ్య మంటలు రేపాయ్. మంటలు అంటించే వరకు వెళ్లాయ్. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఎన్నికల నాటికి రాజకీయం ఎలా ఉండబోతుందో.. ఎలాంటి హింస చెలరేగబోతుందో.. మీ అంచనాలకే వదిలేస్తున్నాం అన్నట్లుగా మారాయనే చర్చ జరుగుతోంది.

ఈ రచ్చ జరుగుతుండగానే.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన కామెంట్స్.. రాజకీయంగా కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయాలంటే భయపడాలి.. ఎవరూ పోటీకి కనీసం ధైర్యం చేయకూడదంటూ.. బ్రహ్మనాయుడు మాట్లాడిన మాటలు.. పల్నాడులో పరిస్థితులకు అద్దంపడుతున్నాయ్. వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.

ఇలాంటి సమయంలో బ్రహ్మనాయుడు మాటలను డీకోడ్ చేస్తే.. తెలియకుండానే గుండెల్లో భయం మొదలవుతోంది చాలామందికి ! ఇదేం కర్మ అని టీడీపీ ఓ కార్యక్రమం నిర్వహిస్తేనే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆఫీసులకు, ఇళ్లకు, వాహనాలకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది వ్యవహారం. అలాంటిది పోటీ చేయాలంటే భయపడాలని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటున్నారు.. పల్నాడు రగలడం ఖాయమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో లెక్కకు మించి హింస ఖాయమా అనే భయాలు వినిపిస్తున్నాయ్. ఏపీలో ఎన్నికలు అంటేనే.. మంటలతో ఆడుకున్నట్లు ఉంటుంది.. అదే పల్నాడులో అయితే నిప్పుతో నేషనల్‌ గేమ్ ఆడినట్లే ! బ్రహ్మనాయుడు కామెంట్లు, వరుసగా జరుగుతున్న పరిణామాలు.. వచ్చే ఎన్నికలకు అద్దం పడుతున్నాయనే చర్చ జరుగుతోంది.