కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. చాలాకాలంగా ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా తన అనుచరులతో సమావేశం అనంతరం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు కన్నా లక్ష్మినారాయణ వెల్లడించారు. తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు కన్నా. టీడీపీ లేదా జనసేనలో ఏదో ఒక పార్టీలో ఆయన చేరుతారని సమాచారం. బీజేపీలో సోము వీర్రాజు ఒంటెద్దు పోకడల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు కన్నా వెల్లడించారు. కాంగ్రెస్ లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కన్నా లక్ష్మినారాయణ.. అంచలంచెలుగా ఎదిగారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నేదురుమల్లి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ వరకూ ఎందరో ముఖ్యమంత్రుల వద్ద ఆయన మంత్రిగా పని చేశారు.
కన్నా లక్ష్మినారాయణ 1955 ఆగస్ట్ 13న గుంటూరు జిల్లాలో జన్మించారు. చిన్నతనంలో వెయిట్ లిప్టింగ్ పై మంచి ప్రతిభ కనబరివారు. బాల్యంలోనే రాజకీయాలపై ఆసక్తి చూపేవారు. దీంతో 1973లో కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇండియా- NSUI అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1987-88లో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా సేవలందించారు. అదే సమయంలో రాజకీయాల్లో చురుగ్గా పనిచేయడంతో పార్టీ అతనికి బీఫాం ఇచ్చి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించింది. 1989లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచిన కొన్నాళ్లకే 1991-94లో నేదురమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రీడలు, కార్మిక, ఉపాధి, శిక్షణ, సహకారశాఖలకు మంత్రిగా కొనసాగారు.
ప్రత్యర్థి ఎవరైనా.. ప్రాంతం ఏదైనా విజయం ఖాయం:
1994లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. కాంగ్రెస్ పోటీ చేసి తీవ్ర పరాభవం మూటకట్టుకుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కన్నా లక్ష్మినారాయణ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన 27 మంది ఎమ్మెల్యేల్లో కన్నా ఒకరు. ఎన్టీఆర్ చరిష్మా ముందుకూడా నిలబడి గెలిచిన ప్రజానాయకుడు కన్నా. కొంత కాలం అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే గడిపేవారు. అప్పటికే మూడు సార్లు శాశనసభ్యులుగా ఎన్నికైన లక్ష్మీనారాయణ 2004, 2009లో మరోసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపోందారు. ప్రాంతం ఏదైనా విజయం మాత్రం ఖాయంగా ఉండేది.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన క్యాబినేట్లో రవాణా, వ్యవసాయ, రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత 2009లో ఎన్నికలు వచ్చాయి. ఈ సారి వైఎస్ఆర్ చరిష్మా, కన్నా ప్రజాబలం రెండూ తోడై మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో భారీపరిశ్రమలు, కామర్స్, ఫుడ్ ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్స్ శాఖ మంత్రిగా కీలక పదవులను అధిరోహించారు. 2009 వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు కూడా క్యాబినెట్ లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగారు. ముఖ్యమంత్రులు ఎవరైనా అందరిపట్ల సానుకూలంగా ఉండే వారు.
గ్రూపు రాజకీయాలు:
మొదట్లో కన్నా పట్ల కొందరు నేతలు విముఖత చూపినప్పటికీ ఆయన ఖచ్చి తత్వానికి, క్రమశిక్షణకు రాజశేఖర్ రెడ్డి గౌరవం ఇచ్చేవారు. ఇదే సమయంలో గుంటూరులోని గ్రూపు రాజకీయాలకు ఇరువురు కీలకనాయకులు నాయకత్వం వహించేవారు. అందులో ఒకరు రాయపాటి సాంబశివ రావు, మరొకరు చేబ్రోలు హనుమయ్య. ఇక్కడ కన్నా చేబ్రోలుతో కలిసి ఉండేవారు. దీంతో కాంగ్రెస్ లో కొనసాగినంత కాలం కన్నాకు, రాయపాటికి పడేది కాదు. ఇరువురి మధ్య తగాదాలు వస్తూ ఉండేవి. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. కన్నాకు వంగవీటి మోహన రంగాతో చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉండేది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే మంత్రి పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గ అభివృద్దికి ఎక్కడా రాజీపడేవారు కాదు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో చిన్నాభిన్నం అవ్వడంతో 2014 ఎన్నికల తర్వాత అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.
బీజేపీలో కన్నా ప్రస్తానం:
గతంలో దాదాపు అందరి క్యాబినేట్లో మంత్రి పదవులు అధిరోహించి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఏపి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. దీనిని చేపట్టిన రోజు నుంచే బీజేపీ బలోపేతంపై దృష్టి సారించారు. 2015-18 మధ్య జాతీయస్థాయి నేతల్లో కూడా గుర్తింపు సాధించారు. ప్రస్తుతం బీజేపీ కోర్ కమిటీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతానికి శ్రమించారు. ఈయన కష్టాన్ని చూసి త్వరలో నామినేటెడ్ పదవి దక్కుతుందనే వార్తలు వినిపించాయి. ఈ లోపే పార్టీలో ఉన్న అసమ్మతివాదుల మాటలకు నొచ్చుకున్న కన్నా పార్టీ వీడే నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన మరో పార్టీలో చేరనున్నారు.
T.V.SRIKAR