ఏం జరిగిందో ఏమో.. టీడీపీ వాళ్లు చెప్తున్నట్లు నిజంగా బెదిరించారో లేదో అర్థం కాలేదు కానీ.. పవన్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. తన సినిమాలేంటో తన సంగతులు ఏంటో అన్నట్లుగా మౌనంగా కనిపించారు. వివేకా కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన సమయంలోనూ కనీసం పెదవి విప్పలేదు పవన్. దీంతో పవన్ ఎప్పుడు జనాల్లోకి వస్తారు.. అసలు వస్తారా రారా అనే చర్చ మొదలైంది.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది ఏపీ రాజకీయాల్లో ! హైదరాబాద్‌లో చంద్రబాబును కలిశారు పవన్ కల్యాణ్. ఓవరాల్‌గా ఈ ఇద్దరికి ఇది మూడో సమావేశం. పవన్ వెళ్లి చంద్రబాబును కలవడం అయితే రెండోసారి. దాదాపు రాష్ట్రంలో ఎన్నికల మూడ్ మొదలైన వేళ.. పవన్ స్వయంగా వెళ్లి చంద్రబాబును కలవడంతో.. ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయా అనే చర్చ కనిపించింది.
ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత.. పవన్ పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. కనీసం చిన్న ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు. దీంతో చంద్రబాబుకు ఢిల్లీ పెద్దల సందేశాన్ని పవన్ వినిపించారా అంటే.. దాదాపు అదే జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. మోదీని ప్రశంసిస్తూ మాట్లాడడం ద్వారా.. బీజేపీని కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సంకేతాలు పంపారు. దీంతో పవన్, చంద్రబాబు మధ్య దీనికి సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇక అటు వీటన్నింటి కంటే ముక్యమగా సీట్ల గురించే ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచినట్లు టాక్. జనసేనకు 50స్థానాలు కావాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తుండగా.. ఎక్కువ సీట్లతో పోటీ చేస్తే మొదటికే మోసం వస్తుందని.. జనసేన ఓడిపోతుందని చంద్రబాబు సముదాయించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కావాలంటే అధికారంలోకి వచ్చాక.. ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. 25 స్థానాల్లో పోటీ చేస్తే.. ఎన్నికల ఖర్చు కూడా తమదే అని చంద్రబాబు హామీ ఇచ్చారన్న ప్రచారం కూడా నడుస్తోంది.
వీటితో పాటు రాష్ట్రంలో బీజేపీని మిత్రపక్షంగా తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వేయాల్సిన అడుగులపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇక అటు త్వరలో వారాహిని బయటకు తీసేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవుతుండగా.. రాజకీయ పర్యటనలు, రూట్‌మ్యాప్ గురించి కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందని టాక్.