ఆశలు రేపడం.. పోరాటం అంటూ కలరింగ్ ఇవ్వడం.. ఆ తర్వాత విషయాన్ని పక్కదారి పట్టించడం.. శ్మశానం ముందు ముగ్గుండదు.. రాజకీయానికి సిగ్గు ఉండదు అంటే ఇది కావొచ్చు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు జనం అనుకుంటున్న మాట ఇదే ! స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యాయం అని కేంద్రం పదేపదే చెప్తున్నా.. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతీసారి చెప్తున్నా.. ఏపీలో పార్టీలు మాత్రం ఇంకా జనాలను ఒక మైకంలోనే ఉంచుతున్నాయ్. ఇంకా చెప్పాలంటే.. వెర్రిపప్పలను చేస్తున్నాయ్. ప్రత్యేక హోదా రాదు.. ఇవ్వము అని కేంద్రం తెగేసి చెప్తోంది. జనాలు కూడా అదే మాటకు అలవాటు అవడం మొదలుపెడుతున్నారు.
పార్టీలు మాత్రం.. ప్రత్యేక హోదా చుట్టూ ఎవరి డ్రామా వాళ్లు ఆడుతున్నారు. జనాల్లో ఆశలు రేపేది వాళ్లే.. చివరికి హ్యాండ్ ఇచ్చేది వాళ్లే ! రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి లెక్కలేస్తే ఇదే నిజం అనిపిస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అందరిదీ ఇదే తీరు ! ఇప్పుడు సీఎం జగన్ అయినా.. ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా.. జనసేనాని పవన్ అయినా.. అందరీ డ్రామానే.. అందరు ఆడుతోంది నాటకమే ! జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి వినిపించే మాట ప్రత్యేక హోదా అని ! కేంద్రం ముందు పెడతారు.. ప్రధానిని అడుగుతారు అని ! కట్ చేస్తే పార్టీ పనులు, పర్సనల్ పనులు ముగించుకొని రాష్ట్రానికి వచ్చేస్తారనే టాక్ ఉంది.
ఇక చంద్రబాబు సంగతి సరేసరి ! ప్రత్యేక హోదా కోసం మోదీతో గొడవ పడ్డానని డ్రామాలు ఆడుతుంటారు. పొత్తు కూడా వదులుకున్నాం అంటారు. మరి పోరాటం సంగతేంటి సార్ అంటే.. మాత్రం చూడండి తమ్ముళ్లు అంటూ మ్యాటర్ డైవర్ట్ చేస్తారు. ఇక ప్రశ్నించేందుకే రాజకీయాలని.. పాలిటిక్స్ మొదలుపెట్టిన పవన్ పరిస్థితి కూడా ఇదే ! అప్పుడెప్పుడో పాచిపోయిన లడ్డూలు అని కేంద్రం మీద ఫైర్ అయిన పవన్.. ఆ తర్వాత బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా మీద ప్రశ్నలు దొరకడం లేదో.. దొరికినా ఎందుకు అనుకుంటున్నారో కానీ.. ఆ విషయం ఎత్తడం కూడా మానేశారు.
ఇలా మూడు పార్టీలు, ముగ్గురు నేతలు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేశారు. కారణం.. కేంద్రం అంటే భయం ! హోదా కావాలని గట్టిగా అడిగితే.. ఏదో కారణం చెప్పి లోపల వేస్తుందేమో అనే టెన్షన్ ! ఆ భయంతోనే స్పెషల్ స్టేటస్ జనాలను వెర్రిపప్పలను చేస్తున్నారు. చూస్తూ ఉండండి.. వచ్చే ఎన్నికల్లోనూ హోదా అంశాన్ని మూడు పార్టీలు కనీసం ఎత్తరు ! వైసీపీని గద్దెదించడమే లక్ష్యం అంటూ ఇప్పుడు టీడీపీ, జనసేన కొత్త పాట అందుకున్నాయ్. ప్రత్యేక హోదా గురించి ఆలోచించడం, ఆశలు పెట్టుకోవడం ఇప్పటికైనా మానేయండి.. ప్రత్యేక హోదా అనేది భ్రమ అని తెలుసుకోంది.