Teachers Unions: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ (గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం)ను వ్యతిరేకిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)ను అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1న వైనాట్ ఓపీఎస్ పేరుతో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీచర్స్ యూనియన్స్ వెల్లడించాయి. ఓపీఎస్ తప్ప మరో పింఛన్ విధానాన్ని ఒప్పుకోబోమని ఏపీ ఉపాధ్యాయ సంఘాలు తేల్చిచెప్పాయి.
ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీపీఎస్, జీపీఎస్ విషయంలో ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎలక్షన్స్‌కు ముందు సీపీఎస్ రద్దు చేస్తామంటూ జగన్ హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తమకు జీపీఎస్ వద్దు.. ఓపీఎస్ కావాలంటూ ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. జీపీఎస్ వ్యతిరేక ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.
సెప్టెంబర్ 1న చలో విజయవాడ
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ గతంలోనే ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. అయితే, దీన్ని ప్రభుత్వం అడ్డుకుంది. ఆ తర్వాత పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ, ఉద్యోగ సంఘాల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమ సన్నాహాల కోసం విజయవాడ యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ నేతలు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కార్పొరేట్ శక్తుల కోసమే ప్రభుత్వం జీపీఎస్ అమలు చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. తాము ఓపీఎస్ తప్ప మరో విధానాన్ని అంగీకరించబోమన్నారు.
త్వరలోనే అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చలో విజయవాడ కార్యక్రమంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయ సంఘాలు చేపట్టే ధర్నాలకు తమ మద్దతు ఉంటుందని యూటీఎఫ్ తెలిపింది. జీపీఎస్ పేరుతో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని వివిధ సంఘాల నేతలు ఆరోపించారు. తమకు ఓపీఎస్ విధానం తప్ప మరో పెన్షన్ విధానం వద్దని స్పష్టం చేశారు. ఇంతకుముందు మంత్రివర్గ ఉప సంఘంతో జరిగిన సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ప్రభుత్వం జీపీఎస్ విధి విధానాలు ప్రకటించకుండా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004కు ముందు నియామకపు ప్రక్రియ పూర్తైన 11 వేల మందికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఉద్యమానికి సిద్ధమవుతుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ సమయంలో ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చకుంటే రాబోయే ఎన్నికల్లో ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉంది. మరోవైపు జీపీఎస్ తప్ప మరో విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు.