Jamili Elections: ఏపీలో, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు.. జమిలి ఎన్నికలపై కేంద్రం తేల్చేసిందా..?

తెలంగాణ ఎన్నికలను కొద్ది రోజులు వాయిదా వేయడం.. ఏపీ ఎన్నికలను కొంత ముందుకు జరపడం వల్ల రెండింటికీ కలిపి ఒకేసారి జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు సిద్ధం కావాలని సూచించింది.

  • Written By:
  • Updated On - September 8, 2023 / 07:07 PM IST

Jamili Elections: జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ కేంద్రం తెలుగు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీకి, తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు కేంద్రం ఆయా రాష్ట్రాధినేతలకు తెలిపింది. జనవరిలో రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ సూచనప్రాయంగా వెల్లడించింది. వీటిని సెమీ జమిలి ఎన్నికలుగా కేంద్రం భావిస్తోంది. నిజానికి తెలంగాణలో డిసెంబర్‌లో, ఏపీకి ఏప్రిల్, మేలో ఎన్నికలు జరగాలి. అయితే, తెలంగాణ ఎన్నికలను కొద్ది రోజులు వాయిదా వేయడం.. ఏపీ ఎన్నికలను కొంత ముందుకు జరపడం వల్ల రెండింటికీ కలిపి ఒకేసారి జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు సిద్ధం కావాలని సూచించింది.
వచ్చే ఏడాది జనవరి వరకు తెలంగాణతోపాటు, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. ఈ ఐదు రాష్ట్రాలతోపాటు మొత్తం 13 రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింతోపాటు మరికొన్ని రాష్ట్రాలను కలిపి జనవరిలో ఎన్నికలు జరపాలనుకుంటోంది. ఇదే సమయంలో జనవరిలోనే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయా రాష్ట్రాలకు సమాచారం పంపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల 13 రాష్ర్టాలు, లోక్‌సభకు కలిపి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అది కూడా అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే సాధ్యమవుతుంది. అంటే.. కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు వాయిదా వేసి.. ఇంకొన్ని రాష్ట్రాలకు ముందస్తుగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. మోదీ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనలకు రాజకీయ పార్టీలు కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది.

ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు జరిపిన చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సీఎం జగన్ చెబుతున్నారు. ఈ అంశాన్ని ఖండించాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీడీపీ, అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం అంతా ఒట్టిదేనని, అయితే, జగన్ ఈ విషయాన్ని నమ్ముతుండొచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. బండి సంజయ్‌ని మార్చి తప్పు చేశామని అధిష్టానం ఆలస్యంగా గుర్తించింది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారింది. బీజేపీ చేసిన పనులు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ లిక్కర్ స్కాం అంశాన్ని సానుభూతి కోసం వాడుకుంటోంది. దీంతో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు సిద్ధమవుతోంది.