YS JAGAN: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా..? నిరుద్యోగుల ఆగ్రహం..!

వైసీపీ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తమకు కలిగిన నష్టాన్ని పవన్‌కు చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్న?’ అంటూ నిరసన వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - October 1, 2023 / 08:01 PM IST

YS JAGAN: ఏపీ సీఎం జగన్‌పై టీచర్ ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగా మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. వారాహి యాత్ర నిర్వహిస్తున్న పవన్‌కు నిరుద్యోగులు ప్లకార్డులు, బ్యానర్ల ద్వారా ఈ విషయంలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్‌ను కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం వారాహి యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభా ప్రాంగణానికి నిరుద్యోగులు భారీగా తరలి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తమకు కలిగిన నష్టాన్ని పవన్‌కు చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్న?’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పవన్‌ను కోరారు.
వైఎస్ జగన్ సీఎం అవ్వకముందు ఉద్యోగులకు అనేక హామీలిచ్చారు. 2018లో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోని 23 వేల ఖాళీ టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దీనికోసం వైసీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామన్నారు. దీంతో టీచర్ కావాలనుకున్న అభ్యర్థులు జగన్ మాటలు నమ్మి, ఆయనకు మద్దతిచ్చారు. కానీ, జగన్ అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లు అవుతున్నా.. ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో టీచర్ ఉద్యోగాలు మరిన్ని ఖాళీ అయ్యాయి. మొత్తంగా ఏపీలో 50 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అన్నారు. ఉన్న ఖాళీల్ని భర్తీ చేయకపోగా, వీటి సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిరుద్యోగులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విలీనానికి 117 జీవో తీసుకొచ్చిందని, దీనివల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గుతోందన్నారు. దీంతో విద్యా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే నిరుద్యోగులకు నష్టం కలిగించే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏపీలో డీఎస్సీ కోసం లక్షలాది మంది యువత ఎదురు చూస్తున్నారని తెలిపారు. పవన్ సభ నిర్వహిస్తున్న సభలోనే గతంలో జగన్ మెగా డీఎస్సీ గురించి ప్రకటన చేశారని విమర్శించారు. వేల రూపాయల ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకున్న నిరుద్యోగులు ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి న్యాయం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పారని అన్నారు. టీచర్ల ఖాళీల్ని జగన్ ప్రభుత్వం భర్తీ చేస్తుందనే నమ్మకం తమకు లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో తామేంటో చూపిస్తామన్నారు.
నిరుద్యోగుల నుంచి ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మాట ఇచ్చి, నిలబెట్టుకోలని జగన్‌పై చాలా కాలంగా నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు.. సీపీఎస్ విషయంలో మాట తప్పినందుకు ఉద్యోగులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈసారి వారి నుంచి జగన్‌కు మద్దతు ఉండకపోవచ్చు.