విశాఖలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరిగింది. లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయని వైసీపీ నేతలు తెగ ఊదరగొట్టేస్తున్నారు . మరి ఈ సమ్మిట్ తో ఏపీ రాత మారిపోతుందా..?
విశాఖలో ఏపీ ప్రభుత్వం గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించింది. ఇందుకోసం చాలానే కష్టపడింది. బాగానే ప్రచారమూ చేసింది. పేపర్లలో యాడ్లు కుమ్మరించింది. టీవీల్లో ప్రకటనలతో ఊదరగొట్టింది. సాగర తీరంలో పెట్టుబడుల వరద పారబోతోందంటూ ప్రభుత్వ అనుకూల మీడియా రాసిపారేసింది. నిజానికి బిజినెస్ సమ్మిట్ నిర్వహించడం మంచిదే… రాష్ట్రంలోని అపార అవకాశాలను వ్యాపార దిగ్గజాలకు పరిచయం చేసి పెట్టుబడులు వచ్చేలా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడం మంచిపనే.. కానీ ఏదో అద్భుతం జరగుతోందని ప్రజల కళ్లకు గంతలు కట్టడం మాత్రం సరికాదు. వైసీపీ నేతలు అదే చేస్తున్నారు.
రెండ్రోజుల్లో 13లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఎంవోయు అంటే కేవలం ఆసక్తి వ్యక్తీకరణే… అందులో ఆచరణలోకి వచ్చేవి ఒకటో రెండో ఉంటాయేమో… ఒక్కోసారి అది కూడా అనుమానమే… సీరియస్‌గా ఇలాంటి సదస్సులకు వచ్చేది అతి కొద్ది మంది మాత్రమే…చాలా మంది వచ్చేది వ్యాపార దిగ్గజాలను కలవడానికి… ఫోటోలకు ఫోజులివ్వడానికే…
విశాఖ సదస్సుతో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. కొన్ని వందల సంస్థలు పెట్టుబడులు పెట్టబోతున్నాయని ఊదరగొట్టేస్తున్నారు. తీరంలో నోట్ల కట్టలు వరదలా పారుతున్నాయన్నట్లే మాటలు కోటలు దాటుతున్నాయి. జిల్లాల్లో వైసీపీ నేతలు కేకులు కట్ చేసి మరీ పండగ చేసుకుంటున్నారు. ఆ 13లక్షల కోట్లు వచ్చిపడ్డాయని వాటితో రాత మారిపోతుందేమో అన్నంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు.
సదస్సుల్లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 10శాతం అమలైనా అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. 13లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేశారు. నిజానికి ఇవన్నీ ఒప్పందాలు మాత్రమే. అన్ని ఎంవోయులు ఫలించి ఆయా సంస్థలన్నీ పెట్టుబడులు పెట్టేస్తాయనుకుంటే భ్రమే. రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి గల అవకాశాలను పరిశీలించి అన్నీ కుదిరితే, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు నచ్చితే, పక్క రాష్ట్రాలు తన్నుకుపోకపోతే అప్పుడు రాష్ట్రానికి ఆ పెట్టుబడి వచ్చినట్లు. ఇందుకు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కుదిరిన 13లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాల్లో అమల్లోకి వచ్చేది ఒకటి రెండే.. కానీ ప్రభుత్వం, మంత్రులు మాత్రం మొత్తం వచ్చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఒక రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే నిలకడైన అభివృద్ధి ఉండాలి. ఆర్థిక కార్యకలాపాలు చురుగ్గా సాగాలి. రాజకీయ స్థిరత్వం ఉండాలి. మౌలిక సదుపాయాలు ఉండాలి. అవన్నీ పరిశీలించాకే మిగిలిన రాష్ట్రాల కన్నా ఎక్కువ రాయితీలు ఉంటాయని వ్యాపారవేత్తలు భావిస్తే అప్పుడు పెట్టుబడులు వస్తాయి.
గతంలో ఇదే విశాఖపట్నంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా బిజినెస్ సమ్మిట్ నిర్వహించింది. వరుసగా మూడేళ్లు సీఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగాయి. 2016లో 4.7లక్షల కోట్లు, 2017లో 10.2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. 2018లో అంతకు మించి అన్నట్లు సదస్సు సాగింది. కానీ అందులో అమల్లోకి వచ్చింది ఎన్ని అంటే మాత్రం తడుముకోవాల్సిందే.
అప్పట్లో భాగస్వామ్య సదస్సులపై ఇప్పటి అధికార వైసీపీ నానా హంగామా చేసింది. అందులో ఎన్ని పెట్టుబడులుగా మారాయో చెప్పాలని డిమాండ్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంవోయూలనే పెట్టుబడులుగా ప్రచారం చేస్తోందంటూ విరుచుకుపడింది. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ నాడు బాబు ప్రభుత్వం చేసిన పనే నేడు వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. అప్పుడు టీడీపీని తిట్టిన నేతలే ఇప్పుడు ఎంవోయూలనే కోట్లుగా చూపించి కనికట్టు చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయమే ఉంది. బటన్ నొక్కడమే తప్ప పెద్దగా అభివృద్ధి గురించి వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవు. రోడ్లు సరిలేవు.. కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. దీన్నుంచి బయటపడటానికి వైసీపీ ప్రభుత్వం ఈ బిజినెస్ సమ్మిట్ ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఒప్పందాలనే పెట్టుబడులుగా విస్తృత ప్రచారం చేసి ఏదో తెచ్చేస్తున్నామని ఇంకేదో చేసేస్తున్నామని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని జనాన్ని నమ్మించే ప్రయత్నమన్నది విపక్షాల ఆరోపణ. నాడు బాబు చేసింది తప్పైతే నేడు జగన్ చేస్తుంది ఎలా ఒప్పవుతుందన్నది ప్రశ్న. మరి దీనికి ప్రభుత్వం బదులిస్తుందా అన్నది చూడాలి
(KK)